కొండారెడ్డి బురుజు సాక్షిగా : ఒక్క సీటు.. రెండు కుటుంబాలు ఫైట్
కర్నూలు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక అసెంబ్లీ సీటు కోసం రెండు కుటుంబాల పట్టు బడుతున్నాయి.

కర్నూలు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక అసెంబ్లీ సీటు కోసం రెండు కుటుంబాల పట్టు బడుతున్నాయి.
కర్నూలు : జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక అసెంబ్లీ సీటు కోసం…రెండు కుటుంబాల పట్టు బడుతున్నాయి. ఇంతకాలం వేర్వేరు పార్టీల్లో ఉన్న ఆ రెండు ఫ్యామిలీలు…ఒకే గూటి కిందికి చేరనున్నాయి. చంద్రబాబు ముందు టీడీపీ సీనియర్ నేత చేసిన ప్రతిపాదనలేంటీ ? ఒక అసెంబ్లీ సీటుతో మూడు కుటుంబాలకు….చెక్ పెట్టవచ్చా ?
మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూరప్రకాశ్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కుటుంబాలు.. దశాబ్ధాలుగా కర్నూలు జిల్లా రాజకీయాలను శాసిస్తున్నాయి. కోట్ల కుటుంబం 60 ఏళ్లకుపైగా రాజకీయాల్లో ఉంటే.. కేఈ కృష్ణమూర్తి కుటుంబం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంది. ఈ రెండు కుటుంబాలే కర్నూలు జిల్లా చక్రం తిప్పుతున్నాయి. ఎంత మంది నేతలొచ్చినా వీళ్లు మాత్రం తమ కేడర్‌ను కాపాడుకుంటూ కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు. ఇప్పటికే కోట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉంటే.. కేఈ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉంది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే కేఈ కుటుంబం కాంగ్రెస్‌లో పని చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ టీడీపీ గూటికి చేరింది.
కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కుటుంబాలకు దశాబ్దాలుగా వైరం ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో…కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లోనే కొనసాగితే రాజకీయ భవిష్యత్ ఉండదనుకున్న కోట్ల …టీడీపీ అధినేతను కలిసి చర్చలు జరిపారు. డోన్ అసెంబ్లీ సీటుతో పాటు కర్నూలు ఎంపీ సీటు కావాలని కోట్ల చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది.
కోట్ల టీడీపీలోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి.. చంద్రబాబు ముందు కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. కోట్ల రాకను స్వాగతించిన ఎస్వీకి చెక్ పెట్టేందుకు కొత్త ప్లాన్ వేశారు. కోట్ల కుటుంబానికి కర్నూలు ఎంపీ సీటుతో పాటు కర్నూలు అసెంబ్లీ సీటు.. పత్తికొండ, డోన్ అసెంబ్లీ సీట్లు తమ కుటుంబానికి ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. కర్నూలు అసెంబ్లీ సీటు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, టీజీ భరత్‌లు పోటీ పడుతున్నారు. ఎస్వీ, టీజీలకు చెక్ పెట్టేందుకు.. వ్యూహాత్మకంగా కోట్ల పేరును తెరపైకి తెచ్చారు కేఈ. కొంతకాలంగా ఎస్వీ, టీజీలు అసెంబ్లీ సీటు తమకంటే.. తమకంటూ రచ్చకెక్కుతున్నారు.
కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఉన్నప్పటికీ గత పార్లమెంట్ ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి.. ఊహించని విధంగా భారీగా ఓట్లు పడ్డాయి. ఇప్పుడిదే విషయాన్ని చంద్రబాబు దగ్గర ప్రస్తావించిన కేఈ కుటుంబం.. కోట్ల కుటుంబానికి కర్నూలు అసెంబ్లీ, పార్లమెంట్ సీటిస్తే గెలుపు సులభమవుతుందని చెప్పినట్లు సమాచారం. ఆలూరు, కర్నూలు అసెంబ్లీ, ఎంపీ సీట్లు తమకే వస్తాయని కోట్ల కుటుంబం చెప్పుకుంటోంది. దీంతో ఒకే దెబ్బకు మూడు పిట్టలన్నట్లు కేఈ కుటుంబం పావులు కదుపుతోంది. డోన్ సీటు తాము దక్కించుకోవడంతో పాటు టీజీ వెంకటేశ్, ఎస్వీ మోహన్‌రెడ్డిలను దెబ్బ తీయవచ్చన్న వ్యూహాలు రచించారు కేఈ సోదరులు. డిప్యూటీ సీఎం సోదరులు వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంతో లేదో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.