హైదరాబాద్‌లో కుట్రలకు బీజేపీ ప్లాన్.. నీచ రాజకీయాలు చేస్తోంది : కేటీఆర్‌

  • Published By: sreehari ,Published On : November 1, 2020 / 07:42 PM IST
హైదరాబాద్‌లో కుట్రలకు బీజేపీ ప్లాన్.. నీచ రాజకీయాలు చేస్తోంది : కేటీఆర్‌

Updated On : November 1, 2020 / 9:21 PM IST

హైదరాబాద్‌లో కుట్రలకు బీజేపీ ప్లాన్‌ చేసిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన ఇష్యూను పెద్దది చేస్తూ.. హైదరాబాద్‌లో తీవ్ర ఆందోళనకు బీజేపీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారని ఆయన అన్నారు.



లాఠీచార్జ్‌, గన్‌ ఫైరింగ్‌ జరిగే రేంజ్‌లో ఆందోళనకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా.. శాంతి భద్రతల అంశంపై రాజీ పడేది లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. అసత్యాలకు బీజేపీ కేరాఫ్‌గా మారిందన్నారు మంత్రి కేటీఆర్‌.



పోలీసులు తమపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ.. బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తమ ఇళ్లలో పట్టుబడితే ఆ డబ్బులు తమవి కాదంటూ బుకాయింపులు.. బెదిరింపులకు దిగుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు.

హైదరాబాద్‌ బీజేపీ డ్రామాలు :
బీజేపీ డబ్బుల డ్రామా ఫెయిలందన్నారు మంత్రి కేటీఆర్‌. దుబ్బాక ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో బీజేపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బుల ఆశ చూపి దుబ్బాక ఓటర్లను కొనేందుకు చూస్తున్నారని.. బీజేపీ నేతల కుట్రలకు ఎలక్షన్‌ కమిషన్‌ బ్రేక్‌ వేస్తోందని కేటీఆర్‌ తెలిపారు.



బీజేపీ నేతల కుట్రల పట్ల దుబ్బాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి కేటీఆర్‌. ఉప ఎన్నికలో ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గుర్తించాలని.. బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని కేటీఆర్‌ కోరారు.