స్పీకర్ దే తుది నిర్ణయం : టీడీపీ సభ్యులపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం

ఏపీ అసెంబ్లీ గేటు దగ్గర నిన్న జరిగిన ఘటనలో టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన సభలో తీర్మానం పెట్టారు. తుది నిర్ణయాన్ని స్పీకర్ కు వదిలేస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని జక్కంపూడి రాజా, గొల్ల బాబూరావు బలపరిచారు. బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. మార్షల్స్ తో జరిగిన ఘర్షణ ఘటనలో ఉన్న సభ్యులపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్ కు అప్పగించారు.
చంద్రబాబు అనకూడని మాట అన్నారని, అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. చంద్రబాబు అన్న మాటలు సభ మొత్తం చూసిందన్నారు. దీనిపై చంద్రబాబు పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని సూచించారు. పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే గౌరవం ఉంటుందన్నారు. ఏదో పొరపాటు జరిగిందని అంగీకరిస్తే హుందాగా ఉంటుందన్నారు. ఎవరికైనా భావోద్వేగాలు ఉంటాయని స్పీకర్ అన్నారు. చంద్రబాబు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే ఓకే.. లేదంటే సభ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పారు. కాగా, అసెంబ్లీలోకి తొసుకొచ్చే ప్రయత్నం చేసిన బయటి వ్యక్తులను గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించారు స్పీకర్.
కానీ అందుకు బాబు సమ్మతించ లేదు. బయట జరిగినదానికి తనను సారీ చెప్పమంటున్నారు కానీ తనకు జరిగిన అవమానానికి ఎవరు బాధ్యత వహిస్తారని స్పీకర్‌ను ప్రశ్నించారు. విచారం వ్యక్తం చెయ్యని పక్షంలో సభ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పీకర్ స్పష్టం చేశారు. టీడీపీ సభ్యులతో కలిసి సభ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన బయటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను స్పీకర్ ఆదేశించారు. జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేయకపోవడమే కాకుండా.. వాటిని కప్పిపుచ్చుకునే ధోరణిలో టీడీపీ ప్రవర్తించిందని ఆరోపిస్తూ…వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన తీర్మానం చేశారు.
14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనను అసెంబ్లీలోనికి అనుమతించకపోవడంతో కాస్త గట్టిగా మాట్లాడాను తప్ప, తప్పుగా మాట్లాడలేదని చంద్రబాబు అన్నారు. “బాస్ట..” అనే పదాన్ని తాను వినియోగించలేదన్నారు. వాట్ నాన్ సెన్స్ అన్నానని చెప్పారు. ఎందుకు గేటు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని ప్రశ్నించానే తప్ప, పౌరుషంగా ప్రవర్తించడం తనకు చేతకాదన్నారు. గతంలో తనను ఉరి తియ్యాలి , చిన్న మెదడు చితికింది లాంటి చాలా పదాలను వైసీపీ నేతలు ఉపయోగించారని చంద్రబాబు గుర్తు చేశారు. నన్ను అంతగా అవమానించినా ఎవరూ విచారం వ్యక్తం చేయలేదన్నారు.