ఆర్టీసీ సమ్మె : ఆగిన మరో గుండె

తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. సమ్మెపై ప్రభుత్వం వైఖరితో కొంతమంది బలవన్మరణాలకు గురవుతున్నారు. మరికొంతమంది తీవ్ర మనస్థాపానికి గురవుతూ..గుండెపోటుతో చనిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపోకి చెందిన కండక్టర్ నాగేశ్వర్.. ఆందోల్ మండలం జోగిపేటలో మృతి చెందాడు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కొంతకాలంగా నాగేశ్వర్ తీవ్ర మనస్తాపంతో ఉంటున్నాడు. భవిష్యత్ గురించి తీవ్రంగా కలత చెందిన నాగేశ్వర్.. మతిస్థిమితం కోల్పోయాడు. ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
2019, నవంబర్ 14వ తేదీ గురువారం తెల్లవారుజామున అతడు కన్నుమూశాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ జేఏసీ నేతలు మృతదేహానికి నివాళులర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు మహబూబాబాద్ డిపోకు చెందిన ఆర్టీసి డ్రైవర్ నరేశ్ మృతి చెందడంతో భూపాలపల్లి బస్సు డిపో నుండి ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుండి పడిగాపులు కాస్తున్నా బస్సులు రాక పోవడంతో ప్రయాణీకులు ,విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రయివేట్ వాహనాలను ఆశ్రయిస్తు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. కోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. 41 రోజులుగా సమ్మె కొనసాగుతుండడంతో..ప్రయాణీకులు అష్టకష్టాలు పడుతున్నారు. అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు పట్టు వీడడం లేదు. రవాణా సదుపాయాల విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. 26 డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న కార్మికులు… పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
Read More : తహసీల్దారు కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం