ఒంగోలు ఎంపీ సీటు ఖాళీ లేదు : వైవీ సుబ్బారెడ్డి

  • Published By: chvmurthy ,Published On : February 23, 2019 / 01:20 PM IST
ఒంగోలు ఎంపీ సీటు ఖాళీ లేదు : వైవీ సుబ్బారెడ్డి

Updated On : February 23, 2019 / 1:20 PM IST

ఒంగోలు:  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా నేనే పోటీ చేస్తానని వైసీపీ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పృష్టం చేశారు. మాగుంట చేరికపై మాకు సమాచారం లేదని, గతంలో ఓడిపోయిన వాళ్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాకు లేదని ఆయన చెప్పారు.  “మాగుంట వస్తే ఎమ్మెల్యే గానో… ఎమ్మెల్సీ గానో  అవకాశం ఇస్తాం….ఇక్కడ మగాళ్లు ఉన్నారు… మిగతా పార్టీనుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసేందుకు ఖాళీ లేదు ” అని మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఉద్దేశించి అన్నారు. ముందు ముందు  టీడీపీ నుంచి  వైసీపీ కి భారీ వలసలు ఉంటాయని సుబ్బారెడ్డి తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ పై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమైనవని సుబ్బారెడ్డి అన్నారు. లండన్ లో కూతురుని చూడటానికి జగన్ మోహన్ రెడ్డి వెళ్తే కుటుంబ  విలువల్లేని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సమాజానికి సిగ్గుచేటని ఆయన విమర్శించారు. సీఎం గా ఈ ఐదేళ్లు  ప్రజల సొమ్ముతో ఇష్టం వచ్చినట్లు విదేశీ టూర్లు తిరిగి, జగన్ పై అర్ధరహితంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో భారీస్థాయిలో వైసీపీ సానుభూతి ఓటర్లను తొలగించిన వ్యక్తి చంద్రబాబేనని,ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరని సుబ్బారెడ్డి అన్నారు. ఈ నాలుగేళ్లు ఏ పధకాలు ప్రకటించని చంద్రబాబు ఎన్నికల ముందు ఓట్ల కోసం ఇప్పుడు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రవేశపెట్టారని ఆరోపించారు. ఇప్పటికే ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టని విధంగా వైసీపీ బీసీ డిక్లరేషన్ను ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు.