పెళ్లకూరు దారెటు..? టీడీపీలో కొనసాగుతారా, వైసీపీలో చేరతారా

నెల్లూరు జిల్లా కోవూరులో టీడీపీకి షాక్ తగలనుందా..? టికెట్‌ ఆశించి భంగపడ్డ టీడీపీ సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి .. పార్టీ మారనున్నారా ? నెల్లూరు పార్లమెంటు

  • Published By: veegamteam ,Published On : March 11, 2019 / 03:17 PM IST
పెళ్లకూరు దారెటు..? టీడీపీలో కొనసాగుతారా, వైసీపీలో చేరతారా

నెల్లూరు జిల్లా కోవూరులో టీడీపీకి షాక్ తగలనుందా..? టికెట్‌ ఆశించి భంగపడ్డ టీడీపీ సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి .. పార్టీ మారనున్నారా ? నెల్లూరు పార్లమెంటు

నెల్లూరు జిల్లా కోవూరులో టీడీపీకి షాక్ తగలనుందా..? టికెట్‌ ఆశించి భంగపడ్డ టీడీపీ సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి .. పార్టీ మారనున్నారా ? నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జి పదవిపై పెళ్లకూరుకు ఆసక్తి లేదా? వైసీపీ గూటికి చేరాలని చూస్తున్నారా?.. మా పార్టీలోకి రమ్మంటూ జనసేన పిలుస్తోందా? రాజకీయ వర్గాలేమంటున్నాయి..? కోవూరులో అసలేం జరుగుతోంది.

సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్నకొద్దీ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ టీడీపీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. అధిష్టానం నిర్ణయంతో టికెట్టు రాని నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. కోవూరు టీడీపీ టికెట్ కోసం ముందు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లరెడ్డి పోటీ పడ్డారు. కోవూరు నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అభ్యర్ధిత్వాన్ని సీఎం చంద్రబాబు ఖరారు చేయడంతో .. అప్పటివరకు టికెట్‌ ఆశించి భంగపడ్డ పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ రాష్ట్ర, జిల్లా అధిష్ఠానాలు అసమ్మతి నాయకులను బుజ్జగించే ప్రయత్నాలు చేశాయి. దీంతో పార్టీ విధేయుడిగా పేరు తెచ్చుకున్న చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డి మాత్రం టీడీపీలోనే కొనసాగుతుండగా .. పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి మాత్రం తన దారి తాను వెతుక్కునే పనిలో పడ్డారు.

పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి 2014 ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈసారి ఎలాగైనా కోవూరు ఎన్నికల బరిలో నిలబడాలని తాపత్రయపడుతున్నారు. మంత్రి సోమిరెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన అండదండలతోనే టీడీపీ టికెట్టును సాధించొచ్చన్న ధీమాతో ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేశారు. అభ్యర్ధుల ఎంపికలో అనేక తర్జనభర్జనలు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశాలు అనంతరం.. నియోజకవర్గ ప్రజల్లోనూ, పార్టీ నాయకుల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అభ్యర్ధిత్వాన్నే .. సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. దీంతో పెళ్లకూరు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇక పెళ్లకూరుకి సర్ధిచెప్పిన చంద్రబాబు.. ఆయన్ని నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా టీడీపీ హ్యాండ్ ఇవ్వడంతో .. పెళ్లకూరుతోపాటు ఆయన అనుచరులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.  

పార్టీ మారాలని అనుచరులు, సన్నిహితులు పెళ్లకూరుపై ఒత్తిడి తెస్తున్నారట. దీంతో పెళ్లకూరు కూడా పార్టీ మారేందుకు సిద్దమైనట్లు సమాచారం. రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకునేందుకు పెళ్లకూరు ఇప్పటికే పలుమార్లు కార్యకర్తలు, సన్నిహితులతో సమావేశాలు జరిపినట్లు తెలుస్తోంది. 2, 3 రోజుల్లో టీడీపీకి ఆయన రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ మనసు మార్చుకుంటుందేమోనని 2 రోజులు వేచి చూడాలని  పెళ్లకూరు భావిస్తున్నారట. ఒకవేళ అలా జరగకపోతే మనమే మనసు మార్చుకుందామని తన అనుచరులతో పెళ్లకూరు చెప్పారట.  

తమ పార్టీలోకి రావాలని పెళ్లకూరుని వైసీపీ ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఈ మధ్య వైసీపీలో చేరిన ఓ మాజీ మంత్రి ప్రధాన అనుచరుడు ఏకంగా పెళ్లకూరు నివాసానికే వెళ్లి ఆయనతో చర్చించగా.. 2 రోజుల తర్వాత స్పందిస్తానని పెళ్లకూరు బదులిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే వైసీపీకి చెందిన మరో నాయకుడు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పెళ్లకూరుని పార్టీలోకి ఆహ్వానించారట. ఆయనకు మాత్రం పెళ్లకూరు ఓకే చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా నామినేటెడ్ పదవి ఇచ్చేలా గట్టి ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. మరోవైపు వైసీపీ సమన్వయకర్త నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చాపకింద నీరులా తన బలాన్ని పెంచుకుంటూపోతున్నాడు. పార్టీలో పెళ్లకూరు రాక కూడా తోడైతే ఇక కోవూరులో వైసీపీకి తిరుగుండదని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకోసం పార్టీలోకి పెళ్లకూరును తీసుకొచ్చేందుకు వైసీపీ నాయకులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీజేపి, జనసేన నాయకులు కూడా పెళ్లకూరుతో టచ్‌లో ఉన్నారు. 2 నెలల క్రితమే పెళ్లకూరు.. జనసేన తరపున కోవూరులో పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి మాత్రం వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. మొత్తం మీద పెళ్లకూరు పార్టీ మారతారా.. టీడీపీలోనే కొనసాగుతారా అనేది వేచి చూడాలి.