సచిన్ పైలట్ వర్గం బసచేసిన హోటల్ వద్ద హైడ్రామా…రాజస్థాన్ పోలీసులను అడ్డుకున్న హర్యానా పోలీసులు

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ దగ్గర శుక్రవారం(జులై-17,2020) హైడ్రామా నెలకొంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ బీజేపీతో బేరాలు సాగించినట్లుగా ఆరోపిస్తున్న ఒక ఆడియో వెలుగులోకి వచ్చింది. దీంతో బీజేపీతో నగదు లావాదేవీలు జరిపారని ఆరోపిస్తూ ఈరోజు ఉదయం, భన్వర్ లాల్ శర్మను, మరో ఎమ్మెల్యే విశ్వేంద్ర సింగ్ ను సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ ప్రకటించింది. అయితే తమపై వచ్చిన ఆరోపణలను భన్వర్ లాల్,విశ్వేంద్ర సింగ్ లు ఖండించారు. టేప్ చేసిన సంభాషణలు ప్రామాణికమైనవి కావు అని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తెలిపారు.
ఈ ఆడియో టేప్‌నకు సంబంధించి రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ టీంలోని ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మ కోసం పోలీసుల ప్రత్యేక టీం.. హర్యానాలోని మానేసర్ హోటల్‌కు చేరుకున్నది. అయితే అక్కడ భారీగా మోహరించిన హర్యానా రాష్ట్ర పోలీసులు రాజస్థాన్ పోలీసులను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ హైడ్రామా నడిచింది. చివరకు రాజస్థాన్ ఎస్‌వోజీ పోలీసులను ఆ హోటల్‌లోనికి అనుమతించారు. ఆడియో టేప్‌లో సంభాషిస్తున్నట్లు ఆరోపణలున్న ఎమ్మెల్యేల వాయిస్ నమూనాలను రాజస్థాన్ పోలీసులు సేకరిస్తారని సమాచారం.
కాగా, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం సచిన్ పైలట్ టీమ్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నదని రాజస్థాన్ సీఎం అశ్లోక్ గెహ్లాట్ ఆరోపించారు. బీజేపీలో చేరబోనంటున్న సచిన్ పైలట్ ఆ పార్టీ అధికారంలో ఉన్న హర్యానాలోని హోటల్‌లో ఎందుకు ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. అయితే, సచిన్ పైలట్, ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ ద్వారాలు తెరిచే ఉంటాయని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మరోసారి పునరుద్ఘాటించింది. సచిన్ పైలట్‌ను జైపూర్‌కు తిరిగి రావాలని పార్టీ అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.
మరోవైపు, సచిన్ పైలట్, ఆయన వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేలపై ఈ నెల 21 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాజస్థాన్ హైకోర్టు శుక్రవారం తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి ఎదురుతిరిగిన సచిల్ పైలట్, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు సీఎల్పీ భేటీకి గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల్లో సమాధానం చెప్పాలంటూ ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనిపై సచిన్ టీమ్ స్పందించలేదు. దీంతో వారిని అనర్హులుగా ప్రకటించాలని రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషిని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ నేపథ్యంలో ఆయన ఆ మేరకు వారికి నోటీసులు పంపారు.
దీంతో సచిన్ అనుచరుడైన ఎమ్మెల్యే పృథ్వీరాజ్ మీనా అనర్హత నోటీసులపై రాజస్థాన్ హైకోర్టులో గురువారం సవాల్ చేశారు. వీరి పిటిషన్లపై కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్, 18 మంది ఎమ్మెల్యేలకు జారీ చేసిన అనర్హత నోటీసులపై స్పీకర్ జోషి మంగళవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంద్రజిత్ మొహంతి, జస్టిస్ ప్రకాష్ గుప్తాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.