గ్రూపు రాజకీయాలు : జగన్ పర్యటనల వాయిదాకు కారకులెవరు ?

విజయవాడ : జగన్ సమర శంఖారావాలు ఎందుకు వాయిదా పడుతున్నాయి ? నెల్లూరు, ప్రకాశం సభలు వాయిదా వెనుక అసలు కారణం ఏంటి ? పార్టీలోని గ్రూప్‌ల వ్యవహారమే ఇందుకు కారణమా ? ఎన్నికలు సమీపిస్తున్నా అధినేత పర్యటనలు వాయిదా పడటం వెనుక అసలు కారకులెవరు ? సుదీర్ఘ పాదయాత్ర తర్వాత వైఎస్ జగన్ మొదలుపెట్టిన సమరశంఖారావాలు రెండు జిల్లాలో వాయిదా పడ్డాయి. మొదటి విడతలో ఐదు జిల్లాల్లో పర్యటించాలని అనుకున్నా.. కేవలం మూడు జిల్లాల్లోనే జగన్ పర్యటించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం పర్యటనలు వాయిదా పడ్డాయి. అయితే.. బలమైన కారణాలు ఉంటే తప్ప జగన్ పర్యటనలు వాయిదా వేసుకోరని పలువురంటున్నారు. అన్ని ఆలోచించిన తర్వాతే జగన్ షెడ్యూల్ ఖరారు చేసుకుంటారని.. ఆ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా పర్యటిస్తారంటున్నారు. ఆ రెండు జిల్లాల్లో పర్యటనలు రద్దు చేసుకున్నారంటే.. అక్కడ నెలకొన్న గ్రూపు రాజకీయాలే కారణమా ? అనే సందేహం నేతల్లో తలెత్తుతోంది.
నెల్లూరులో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పార్టీ అధినేత తీరు పట్ల కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటును మరొకరికి ఇవ్వాలని జగన్ యోచిస్తున్నారు. ఇందుకు రాజమోహన్‌రెడ్డి కుమారుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ పేరును పరిశీలిస్తున్నారు. మీరు తప్పుకుని మీ కుమారుడికి అవకాశమివ్వాలని రాజమోహన్‌రెడ్డికి జగన్ నేరుగానే సూచించినట్లు సమాచారం. అదే సమయంలో ఎంపీ సీటు కోసం మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేరును సైతం పరిశీలిస్తున్నారు. అయితే.. ఆనం అభ్యర్థిత్వాని రాజమోహన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఆనం, మేకపాటి వర్గీయుల మధ్య పొసగడం లేదు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య సఖ్యత కుదిరిన తర్వాతే జిల్లాలో పర్యటిస్తానని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రతి సీటు కీలకమైనందున గ్రూప్ రాజకీయాలు పక్కనపెట్టి పని చేయాలని నేతలకు సూచించినా పట్టించుకోకపోవడంతో.. జగన్ నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా వేసుకుని ఉండవచ్చునని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ప్రకాశం జిల్లా పర్యటన వెనుక కూడా ఇలాంటి కారణమే ఉండవచ్చునని తెలుస్తోంది. ఒంగోలు నుంచి జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అక్కడనుంచి ఆయన్ను తప్పించి యువ నాయకుడిని బరిలో నిలపాలని జగన్ భావిస్తున్నారు. పార్టీ గెలుపు కోసం సొంత కుటుంబ సభ్యుల టికెట్లను సైతం జగన్ త్యాగం చేశారనే సంకేతం పంపేందుకు బాబాయికి కాకుండా మరొకరికి టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఈ విషయం సుబ్బారెడ్డికి రుచించలేదని.. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని పార్టీ నేతలంటున్నారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జగన్‌ను కలిసిన సమయంలో కూడా అందుకే హాజరు కాలేదంటున్నారు. తనకు తెలియకుండానే జిల్లా పార్టీలో జరుగుతున్న మార్పులను సుబ్బారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే జగన్ ప్రకాశం జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
ఇదిలావుంటే.. పార్టీ అధినేతగా గ్రూపు రాజకీయాలపై చర్య తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల ముందు ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటే.. అది పార్టీకి తీవ్రనష్టం కలిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అందుకే ఇరు వర్గాలతో చర్చించి.. మాట వినని వారిపై ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా పార్టీ విభేదాలతో సమర శంఖారావాలు వాయిదా పడడం మాత్రం ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.