మూడు వద్దు.. ఒకటే ముద్దు : రాజధానిపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్

ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని అన్న దిశగా అసెంబ్లీలో తమ వాదన బలంగా వినిపించాలని టీడీపీ నిర్ణయించింది. రాజధానిని అమరావతి నుంచి మార్చడానికి ప్రభుత్వం తీసుకొచ్చే

  • Published By: veegamteam ,Published On : January 20, 2020 / 01:31 AM IST
మూడు వద్దు.. ఒకటే ముద్దు : రాజధానిపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్

Updated On : January 20, 2020 / 1:31 AM IST

ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని అన్న దిశగా అసెంబ్లీలో తమ వాదన బలంగా వినిపించాలని టీడీపీ నిర్ణయించింది. రాజధానిని అమరావతి నుంచి మార్చడానికి ప్రభుత్వం తీసుకొచ్చే

ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని అన్న దిశగా అసెంబ్లీలో తమ వాదన బలంగా వినిపించాలని టీడీపీ నిర్ణయించింది. రాజధానిని అమరావతి నుంచి మార్చడానికి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతిపాదనల్ని గట్టిగా వ్యతిరేకించేందుకు సిద్ధమైంది. ప్రాంతాలకు అతీతంగా పార్టీ ఎమ్మెల్యేలందరూ ఇదే వాణిని వినిపించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

పలు మార్గాలు రెడీ చేసుకున్న టీడీపీ:
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగాలని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం తీర్మానించింది. రాజధాని మార్పు నిర్ణయాన్ని ఆపడానికి సర్వశక్తులూ ఒడ్డాలని నిర్ణయించింది. అమరావతి ఉద్యమంలో దూకుడుగా ఉన్న చంద్రబాబు… ఇవాళ(జనవరి 20,2020) అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇప్పటికే అమరావతి జేఏసీ నిరసన కార్యక్రమాలు.. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. దీంతో ముట్టడి పిలుపు ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో.. అసెంబ్లీ, శాసనమండలిలో పరిస్థితుల్ని కూడా కంట్రోల్ చేయాలన్న లక్ష్యంతో.. టీడీపీ ఉంది. రాజధాని తరలింపు అంశాన్ని నేరుగా బిల్లులో పెట్టకుండా పని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి విరుగుడు వ్యూహంపై తెలుగుదేశం పార్టీ దృష్టిసారించింది. న్యాయనిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. మండలిలో బిల్లును తిరస్కరించటం… లేదా రెండు, మూడ్రోజులపాటు చర్చ నిర్వహించాలని పట్టుబట్టడం… బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే విధంగా తీర్మానం చేయటం లాంటి మార్గాల్ని రెడీ చేసుకున్నట్లు సమాచారం.

babu

ఆ నలుగురికి కీలక బాధ్యతలు:
టీడీఎల్పీ సమావేశంలో పార్టీ సభ్యులకు వ్యూహాల్ని వివరించారు చంద్రబాబు. అసెంబ్లీ వేదికగా వాదన వినిపించేందుకు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్‌లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. బిల్లు ఏ రూపంలో ప్రభుత్వం తీసుకు వస్తుందనేది.. ఆసక్తికర అంశంగా మారింది. కౌన్సిల్‌లో ఏ రూపంలో వచ్చినా బిల్లుపై అప్పటికప్పుడు వ్యూహం రూపొందించుకునే బాధ్యతల్ని యనమల రామకృష్ణుడుకు అప్పగించారు. అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండటంతో కౌన్సిల్ లో ఆయన ప్రభుత్వ వ్యూహాల్ని తిప్పికొడతారని అంచనా వేస్తున్నారు.

 

ప్రభుత్వం తరపు నుంచి చేస్తున్న తప్పుడు ప్రచారాలను కూడా తిప్పికొట్టాలని… ఇందుకు అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకోవాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభాపక్ష సమావేశంలో వ్యూహాలను ఖరారు చేసింది. అదే విధంగా అసెంబ్లీలో సంఖ్యా బలం తక్కువైనప్పటికీ, గళం వినిపించడంలో దీటుగా ముందుకెళ్లాలని టీడీపీ నిర్ణయించుకుంది. బయట అసెంబ్లీ ముట్టడి.. లోపల అధికార పక్షాన్ని కట్టడి చేసి.. అమరావతి నిర్ణయంపై ముందుకెళ్లకుండా చేయాలని టీడీపీ పట్టుదలగా ఉంది.

ganta

గంటా ఎందుకు రాలేదు..?
మరోవైపు అత్యంత కీలకమైన టీడీఎల్పీ సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గైర్హాజరు కావడం పార్టీ పెద్దల్ని టెన్షన్‌ పెడుతోంది. ఐదుగురు ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరు కాలేదని వార్తలొచ్చాయి. మూడు రాజధానుల్ని సమర్థిస్తున్న విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు రాలేదు. వీరిలో కీలక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. గైర్హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని వర్తమానం పంపారు.

 

ama

ఏపీ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు:
ఇవాళ ఏపీ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన రోజు. చరిత్ర మలుపు తిరిగే రోజు. అయినప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధినేత ఆదేశాన్ని ధిక్కరించారు. పార్టీ కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. గైర్హాజరైన ప్రజాప్రతినిధులకు అమరావతిపై ఇంట్రెస్టు లేదా అనే సందేహం కలుగుతోంది. టీడీపీకే కాదు, వ్యక్తిగతంగా కూడా చంద్రబాబుకు ఈ రోజు సమావేశం చాలా కీలకమైంది. అయినా చాలామంది తమ్ముళ్లు రాలేదంటే ఏమనుకోవాలి?

 

టీడీపీకి బలం ఉన్నది మండలిలోనే. అక్కడ అధికార పార్టీకి కేవలం 9మంది సభ్యులే ఉన్నారు. కానీ మండలి సభ్యులే ఎక్కువమంది టీడీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టారు. అయితే నిన్న(జనవరి 19,2020) టీడీఎల్పీకి హాజరుకానివారంతా… ఇవాళ రేపు అసెంబ్లీకి, మండలికి తప్పకుండా హాజరవుతారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులందరికీ తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ విప్‌ జారీ చేసింది. జగన్‌కు మద్దతు ఇస్తూ టీడీపీకి దూరంగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్‌కు కూడా విప్‌ జారీ అయింది.

Also Read : జగన్ ఫిక్సయ్యారు : 3 రాజధానులపై నేడే అధికారిక ప్రకటన..?