సభకు తాగి వచ్చారు, చైర్మన్ ను కొట్టాలని చూశారు : యనమల సంచలన వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు బ్రేక్ పడింది. ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారు ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్. దాంతో జగన్ ప్రభుత్వం జోరుకి అడ్డుకట్ట పడింది. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంతో ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. బిల్లులపై ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై న్యాయ, రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు సీఎం జగన్. అవసరమైతే అసెంబ్లీని ప్రొరోగ్ చేసి ఆర్డినెన్స్ తేవాలని యోచిస్తున్నారు.
దీనిపై టీడీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. మండలి సెలక్ట్ కమిటీకి బిల్లు వెళ్లాక ఆర్డినెన్స్ ఇవ్వం అసాధ్యం అని యనమల స్పష్టం చేశారు. సెలక్ట్ కమిటీ ఏర్పడ్డాక ప్రజాభిప్రాయం తీసుకోవచ్చని చెప్పారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను తాము వ్యతిరేకించడం లేదని యనమల తెలిపారు. సెలక్ట్ కమిటీకి బిల్లులను పంపితే తప్పేంటి? అని ఆయన ప్రశ్నించారు. సెలక్ట్ కమిటీకి బిల్లులను పంపడం ద్వారా.. ప్రజాభిప్రాయం తీసుకుంటారని, అందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. ఈ ప్రక్రియకు మూడు నెలల కంటే ఎక్కువే టైమ్ పట్టొచ్చన్నారు.
మండలిలో వైసీపీ సభ్యుల ప్రవర్తన దారుణంగా ఉందన్నారు యనమల. చైర్మన్ ను చుట్టుముట్టి సభలో గందరగోళం సృష్టించారని వాపోయారు. వైసీపీ సభ్యులు కొందరు తాగి సభకు వచ్చారని, రభస సృష్టించారని యనమల ఆరోపించారు. సభలో ఎన్నడూ చూడని పరిణామాలను మంత్రులు ప్రదర్శించారని యనమల మండిపడ్డారు.
Also Read : 3 రాజధానుల కోసం : జగన్ ముందు మూడు ఆప్షన్లు