కొత్తగా 17 కులాలను బీసీల్లో చేర్చిన తెలంగాణ ప్రభుత్వం

అణగారిన కులాల ఆత్మగౌరవం నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర బీసీ కమిషన్ ప్రతిపాదన మేరకు సీఎం కేసీఆర్ అభివృద్ధికి దూరంగా ఉన్న 17 కులాల వారిని బీసీ జాబితాల్లో చేర్చేందుకు అనుమతించారు. ఈ మేరకు సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా బీసీ కులాల జాబితాలోకి వచ్చిన 17 కులాల వారిలో సంచార జీవనం సాగిస్తున్నవారే అధిక సంఖ్యలో ఉన్నారు.
బీసీ ‘ఏ’ గ్రూపులో అద్దెపువారు, బాగోతుల, బైల్ కమ్మర, ఏనూ టి, గంజికూటివారు, గౌడ జెట్టి, కాకి పడగల, పటంవారు/మాసయ్యలు, ఓడ్, సన్నాయిల, క్షత్రియ రామజోగి, తెరచీరల, తోలుబొమ్మలాటవారు/బొప్పల కులాలను చేర్చారు. బీసీ ‘డీ’ గ్రూపులో అహిర్ యాదవ్, గొవిలి, కుల్లకడగి, సారోల్లు కులాలను చేర్చారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఈ 17 కులాలకు చెందిన 9,839 కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
టీఆర్ఎస్ ప్రభుత్వం అణగారిన వర్గాలు, పేదల పక్షాన నిలుస్తుంది. అన్ని కులాలు, మతాలకు సమాన ప్రా ధాన్యం ఇస్తూనే ఎన్నో ఏండ్లుగా గుర్తింపునకు నోచుకోని 17 కులాల వారిని బీసీల జాబితాలోకి చేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తగా బీసీల జాబితాలో చేర్చిన ఈ కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన తెలిపారు.
తెలంగాణ వస్తే జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పిన సీఎం కేసీఆర్ చేతల్లో చేసి చూపించారు. 17 కులాలను బీసీ జాబితాలోకి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్ప పరిణామం. అయిదు దశాబ్దాలుగా తీరని ఈ వర్గాల వ్యధను సీఎం కేసీఆర్ తీర్చగలిగారని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ వ్యాఖ్యానించారు.
https://10tv.in/no-plan-for-national-party-cm-kcr-sensational-statements-in-trslp-meeting/
73 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మేం భూమ్మీద ఉన్నా.. ప్రభుత్వ రిజర్వేషన్ లెక్కల్లో లేం. ఇన్నేళ్ల తర్వాత సీఎం కేసీఆర్ వల్లనే మా కులాలకు గుర్తింపు వచ్చింది. అందరిలాగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని కోరుకున్నాం. అది ఇప్పుడు ఫలించింది. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు రెండేండ్లపాటు ఇంటింటికి తిరిగి మా జీవన ప్రమాణాలు తెలుసుకొని ఈ నివేదికను ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మాకు పండుగ లాంటిది. సీఎం కేసీఆర్‌ను ఎన్ని జన్మలెత్తినా మరచిపోలేం. – మోహన్ చవాన్, గుర్తింపులేని 17 కులాల సంఘం అధ్యక్షుడు
తెలంగాణ బీసీ కమిషన్ చేసిన ప్రతిపాదన ఆధారంగా అట్టడుగు జీవితాన్ని అనుభవిస్తున్న 17 కులాలను బీసీ జాబితాలో చేర్చడం చారిత్రాత్మక నిర్ణయం. గతంలో ఆయా కమిషన్ల ప్రతిపాదనలను అప్పటి ప్రభుత్వాలు బుట్టదాఖలు చేశాయి. అన్ని కులాలు, మతాలు, వర్గాలకు చెందిన సమస్యలు, బాధలు తెలిసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాలనాదక్షతకు నిదర్శనమిది. -ఈ ఆంజనేయగౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు