కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో అనూహ్య మార్పు
ఇప్పటివరకు చర్చలో ఉన్న పేర్లలో మార్పులు జరిగాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది.

Big Shock For Addanki Dayakar
Congress MLC Candidates : ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. రెండు స్థానాలకు గాను మహేష్ కుమార్ గౌడ్, బల్మూర్ వెంకట్ పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. అయితే, చివరి నిమిషంలో ఎవరూ ఊహించని మార్పు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటివరకు చర్చలో ఉన్న పేర్లలో మార్పు జరిగింది. జాబితా నుంచి అద్దంకి దయాకర్ ను పక్కన పెట్టారు. అద్దంకి దయాకర్ ను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మొదటి నుంచి ప్రచారంలో ఉన్న అద్దంకి దయాకర్ కు ఏఐసీసీ మొండిచేయి ఇచ్చింది. అనూహ్యంగా అద్దంకి స్థానంలో మహేశ్ కుమార్ గౌడ్ కు ఛాన్స్ ఇచ్చింది. బీసీ కోటాలో చోటును మహేశ్ దక్కించుకోగా, మరో స్థానానికి రాహుల్ గాంధీ ఛాయిస్ లో ఎన్ ఎస్ యూఐ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ కు అవకాశం దక్కింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్ ను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అద్దంకికి సైతం క్లారిటీ ఇచ్చింది ఏఐసీసీ.
కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కు మొండి చేయి ఎదురైందని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థుల వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు కాంగ్రెస్ కు వస్తాయని తేలిన మరుక్షణం నుంచి.. అద్దంకి దయాకర్ అందులో ఒక స్థానానికి కన్ ఫర్మ్ అని ప్రచారం జరిగింది. తనకొక ఎమ్మెల్సీ స్థానం వస్తుందని అద్దంకి దయాకర్ కూడా ధీమాగా ఉంటూ వచ్చారు. అయితే, రెండో స్థానం కోసం పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులో మహేశ్ కుమార్ పేరు కూడా ఉంది. నిన్న.. అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ పేర్లు దాదాపుగా ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. నామినేషన్ పత్రాలు కూడా సిద్ధం చేసుకునే పరిస్థితి. అయితే, అద్దంకి స్థానంలో మహేశ్ కుమార్ గౌడ్ పేరుని ఖరారు చేసింది కాంగ్రెస్ అగ్రనాయకత్వం.
Also Read : ఆ 3 ఎంపీ సీట్లపైనే 3 ప్రధాన పార్టీల గురి.. ఆ మూడు ఏవి అంటే..
ఎన్ఎస్ యూఐ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు ప్రతి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలనే నిర్ణయాన్ని రాహుల్ గాంధీ తీసుకున్నారు. అందులో భాగంగానే.. ఎన్ ఎస్ యూఐ అధ్యక్షుడిగా ఉన్న బల్మూర్ వెంకట్ కు అనూహ్యంగా అవకాశం వచ్చింది. ఇక, మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీలో చాలా కీలకంగా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. మొన్నటి ఎన్నికల్లో వెంకట్ (హూజూరాబాద్ టికెట్ ఆశించారు), మహేశ్ కు(నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు) టికెట్ దక్కలేదు. రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేయడంతో కామారెడ్డి టికెట్ ఆశించిన షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయించారు. దాంతో మహేశ్ కుమార్ గౌడ్ కు టికెట్ దక్కలేదు. దాంతో వెంకట్, మహేహ్ లకు ఈసారి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ హైకమాండ్.
Also Read : బీఆర్ఎస్‌లో హాట్ సీట్‌గా ఆ పార్లమెంటు నియోజకవర్గం.. సవాల్‌గా మారిన అభ్యర్థి ఎంపిక, కేసీఆరే పోటీ చేస్తారా?
కాగా.. మొన్నటి ఎన్నికల్లో అద్దంకి దయాకర్ కూడా తుంగతుర్తి టికెట్ ఆశించారు. అయితే, చివరి నిమిషంలో పార్టీలో మందుల సామేల్ కు అవకాశం దక్కింది. టికెట్ దక్కకపోయినా.. సామేల్ కు మద్దతుగా అద్దంకి దయాకర్ పని చేశారు. టికెట్ త్యాగం చేసినందుకు గాను అద్దంకికి కచ్చితంగా ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని అంతా అనుకున్నారు. అంతేకాదు కేబినెట్ లోకి తీసుకుంటారు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ, అద్దంకి దయాకర్ ను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలనే నిర్ణయానికి కాంగ్రెస్ హైకమాండ్ వచ్చిందని, అందులో భాగంగానే ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదని తెలుస్తోంది. ఈ మేరకు ఈ సమాచారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ అద్దంకికి చేరవేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అద్దంకి దయాకర్ కొంత అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. తుంగతుర్తి టికెట్ తనకు దక్కకుండా అడ్డుకున్న వ్యక్తులే ఇప్పుడు తనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుపడ్డారు అన్న తీవ్రమైన అసంతృప్తిలో అద్దంకి దయాకర్ ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ కోసం సహనంగా ఉంటా: అద్దంకి దయాకర్
ఎమ్మెల్సీ స్థానాల ప్రకటనపై అద్దంకి దయాకర్ స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుడినని, అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. పార్టీ కోసం సహనంగా ఉంటానని, తనకు మరింత మంచి పొజిషన్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. తన పట్ల పార్టీ హైకమాండ్ సానుకూలంగా ఉందని అభిప్రాయపడ్డారు.