మంత్రిగారు ఎందుకిలా? : కొప్పుల ఈశ్వర్‌లో ఊహించని మార్పు!

అనుభవం నేర్పిన పాఠం.. ఏ గురువూ నేర్పలేడు. ఇది.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సరిగ్గా సరిపోతుంది. గత ఎన్నికలు నేర్పిన గుణపాఠం.. ఆయనలో ఎవరూ ఊహించని మార్పు తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఆయన ఎవరినీ దగ్గరికి రానివ్వడం లేదట. ఏ పని చేయమని కోరినా.. మొహం మీదే నో అని చెప్పేస్తున్నారట. ఎక్కువగా ఎవరిని నమ్మినా.. తనకే గోతులు తీస్తారేమోనని భయపడుతున్నారట. ఈ మార్పును తట్టుకోలేక.. అనుచరులు, స్థానిక నేతలు తలలు పట్టుకుంటున్నారు.
కొప్పుల ఈశ్వర్.. తెలంగాణ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టపోయింది. అందరినీ గుడ్డిగా నమ్మి.. భారీ మెజారిటీతో గెలుస్తాననుకున్న తనకు.. ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయ్. కొద్దిలో ఓటమి తప్పి.. గెలుపుతో బయటపడ్డారు. అలా.. ఎన్నికలు నేర్పిన గుణపాఠంతో.. మంత్రి గారు మరీ జాగ్రత్తగా ఉంటున్నారని చెప్పుకుంటున్నారు.
మార్పుకు కారణం ఇదేనా? :
కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో.. ఎప్పుడూ ప్రజలతో, పార్టీ కేడర్‌తో కలిసిపోయి ఉండే ఈశ్వర్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా మారిపోయారని చెబుతున్నారు. ఎవరిని పడితే వారిని నమ్మడం లేదట. ఎవరికి ఏ అవసరమొచ్చినా.. కింది స్థాయి నేతల మధ్యవర్తిత్వం అవసరం లేకుండా రూట్ క్లియర్ చేశారు. ఎలాంటి పని పడినా.. తననే నేరుగా కలవాలని నియోజకవర్గ ప్రజలకు చెబుతున్నారట. ఈ మార్పుకు కారణం.. అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు ఆయనను వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారని ఈశ్వర్ బలంగా నమ్ముతున్నారు. అలాంటి వారు.. తన దరిదాపులకు కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నారట.
ధర్మపురి ప్రజల తరఫున.. పార్టీ లీడర్లు ఎవరైనా పైరవీలు పట్టుకొస్తే.. మొహం మీదే నో అని చెప్పేస్తున్నారట కొప్పుల ఈశ్వర్. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నేరుగా అందిస్తూ.. ఎవరికీ డబ్బులివ్వొద్దని లబ్ధిదారులకు చెబుతున్నారట. ఎన్నికల సమయంలో.. ఈశ్వర్ ఓటమికి ప్రయత్నించిన వారిలో కొందరు ఇప్పటికే పార్టీ వీడారు. మిగిలిన వారు.. పార్టీలోనే సైలెంట్‌గా ఉన్నారు.
కొప్పుల ఈశ్వర్ మంత్రి అయ్యాక.. అధికారులను కూడా తన గ్రిప్‍లో పెట్టుకున్నారనే టాక్ నడుస్తోంది. తాను చెప్పిన వారికే పనులు చేయాలంటూ ఆదేశించారని పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తనను దెబ్బ తీయాలని ప్రయత్నించిన వారితో పాటు పార్టీకోసం నమ్మకంగా పనిచేసే వారిని కూడా ఈశ్వర్ దూరం పెడుతుండటంతో.. కిందిస్థాయి నేతలు తలలు పట్టుకుంటున్నారట.