Ganni Veeranjaneyulu : జనసేనకు వద్దు అంటూ వెయ్యి కార్లతో టీడీపీ కార్యాలయానికి ర్యాలీ.. ఉంగుటూరు టీడీపీలో టికెట్ వార్
గన్నితోనే ఉంగుటూరు అనే నినాదంతో వెయ్యి కార్లలో మంగళగిరి టీడీపీ కార్యాలయానికి తెలుగు తమ్ముళ్లు ర్యాలీగా వెళ్లారు.

Ganni Veeranjaneyulu
Ganni Veeranjaneyulu : ఏలూరు జిల్లా ఉంగుటూరు టీడీపీలో టికెట్ గొడవ మొదలైంది. ఉంగుటూరు సీటుని జనసేనకు కేటాయించ వద్దని గన్ని వీరాంజనేయులు వర్గం డిమాండ్ చేస్తోంది. గన్నితోనే ఉంగుటూరు అనే నినాదంతో వెయ్యి కార్లలో మంగళగిరి టీడీపీ కార్యాలయానికి తెలుగు తమ్ముళ్లు ర్యాలీగా బయలుదేరారు.
ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుకు ఉంగుటూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఉంగుటూరుపై టీడీపీ పునరాలోచన చేసి జనసేనకు వేరే టికెట్ కేటాయించాలని గన్ని వీరాంజనేయులు అనుచరులు సూచించారు.
గన్ని వీరాంజనేయులుకు టికెట్ ఇవ్వలేదని ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఉంగుటూరు గెలుపు టీడీపీదే అని, టీడీపీకే టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రబాబుని అభ్యర్థించారు.
అసెంబ్లీ టికెట్ వ్యవహారం ఉంగుటూరు టీడీపీలో చిచ్చు రాజేసింది. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంతో పాటు జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసిన గన్ని వీరాంజనేయులుకే సీటు లేకుండా చేస్తే నియోజకవర్గంలోని మిగతా నేతలు కూడా డీలా పడే అవకాశం ఉందని ఉంగుటూరు టీడీపీ నేతలు వాపోతున్నారు. నియోజకవర్గంలో గన్ని వీరాంజనేయులుకు కాకుండా ఎవరికి టికెట్ కేటాయించినా, ఏ పార్టీకి ఇచ్చినా.. అక్కడ ఓటమి తప్పదని గన్ని వీరాంజనేయులు మద్దతుదారులు హెచ్చరిస్తున్నారు.
గత కొన్ని రోజుల నుంచి గన్ని వీరాంజనేయులు ప్రతీ ఇంటిని, ప్రతీ గడపను తాకుతూ టీడీపీని విస్తరింపజేశారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఈ మేరకు అధిష్టానానికి కూడా విన్నవించారు. టికెట్ విషయంలో మరోసారి పునరాలోచన చేయాలని, ఉంగుటూరు నియోజకవర్గ టికెట్ ను జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గన్ని వీరాంజనేయులుకే కేటాయించాలని ఆయన అనుచరులు, మద్దతుదారులు చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : శ్రీ కృష్ణుడి పాత్ర మీది.. అర్జునుది పాత్ర నాది: పొత్తులపై జగన్ కామెంట్స్