కేసీఆర్ ఎక్కడి నుంచి : కరీంనగర్ నుంచి మళ్లీ వినోద్

  • Published By: veegamteam ,Published On : January 3, 2019 / 02:32 PM IST
కేసీఆర్ ఎక్కడి నుంచి : కరీంనగర్ నుంచి మళ్లీ వినోద్

హైదరాబాద్: టీఆర్ఎస్ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్.. పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అప్పుడే అభ్యర్థులను ప్రకటించేస్తోంది. సిట్టింగ్ ఎంపీలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వబోతున్నట్టు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇదివరకే సంకేతాలిచ్చారు. దాన్ని నిజం చేస్తూ అభ్యర్థిని ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ తమ తొలి ఎంపీ అభ్యర్థి పేరుని ప్రకటించింది. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ మరోసారి పోటీ చేస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. వినోద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటిస్తున్న కేటీఆర్ ఎంపీ అభ్యర్థిని అనౌన్స్ చేశారు.
నల్లగొండ లేదా మెదక్:
దేశంలో గుణాత్మక మార్పు తీసుకొస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేయాలని భావిస్తున్న కేసీఆర్… కచ్చితంగా ఏదో ఒక ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమే. గతంలో ఆయన కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్, మెదక్ లేదా నల్లగొండ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని… అందులోనూ కరీంనగర్‌కే తొలి ప్రాధాన్యత ఇవ్వొచ్చని కథనాలు వచ్చాయి. అయితే కరీంనగర్ ఎంపీగా మరోసారి వినోద్ కుమార్‌ పోటీ చేస్తారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ మొదలైంది.