కేసీఆర్ లంచ్ మీటింగ్ : ఆర్టీసీ జేఏసీ నేతలకు అందని ఆహ్వానం

అన్ని డిపోల కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్ పెట్టినా… అసలు యూనియన్లను ఏమాత్రం పట్టించుకోలేదు. వారిని కనీసం ఆహ్వానించలేదు. ఇప్పటికే కార్మిక సంఘాల కోరలు పీకేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన కేసీఆర్.. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. బస్సు భవన్‌లో ఉన్న ఆర్టీసీ గుర్తింపు సంఘం కార్యాలయానికి అధికారులు తాళాలు వేశారు. నేతలు కూడా డ్యూటీలు చేయాల్సిందే అంటూ ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. వారికి ఇచ్చే సౌకర్యాల్లో కూడా కోతపడింది. మరోవైపు… 50 రోజులకుపైగా సమ్మె చేసినా… ఒక్క డిమాండ్ కూడా నెరవేరలేదు. దీంతో.. జేఏసీ నేతలపై కొంతమంది కార్మికులు కారాలు మిరియాలు నూరుతున్నారు.
సమ్మె సమయంలో యూనియన్ల మాయలో పడొద్దంటూ కార్మికులకు సూచించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు వారి ప్రమేయం లేకుండానే కార్మికులతో నేరుగా చర్చలు జరిపారు. తిరిగి విధుల్లో చేరాలంటూ కార్మికులకు పిలుపునిచ్చే సమయంలో కూడా.. ఆర్టీసీలో ఇక కార్మిక సంఘాలు ఉండనే ఉండవంటూ కేసీఆర్ స్పష్టంగా చెప్పేశారు. అందుకు తగ్గట్లే ఆర్టీసీలో యూనియన్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
సీఎంతో సమావేశానికి హాజరయ్యే కార్మికులను డిపో మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లే ఎంపిక చేశారు. ఫలానా వారిని సమావేశానికి పంపిద్దాం అని సూచించే అవకాశం కూడా ఒక్క నేతకు దక్కలేదు. సంక్షేమానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి.. ఇంకా యూనియన్లతో పనేముంది అనే అభిప్రాయం కార్మికుల్లో కలిగే అవకాశం ఉంది. యూనియన్లు లేకుండా సమస్యలను ఎలా పరిష్కరిస్తానే అంశాలను కూడా కేసీఆర్ కార్మికులతో పంచుకోనున్నారు. అయితే… ప్రగతి భవన్ మీటింగ్‌పై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. యూనియన్లను బలహీనపరిచేందుకే ఇష్టాగోష్టి ఏర్పాటు చేశారంటున్నారు.
Read More : ప్రియాంక రెడ్డి ఘటనపై వర్మ ట్వీట్ : రేపిస్టులను ప్రశ్నించడం టీవీల్లో ప్రసారం చేయాలి