వైసీపీ లోకి వల్లభనేని వంశీ ! దీపావళి తర్వాత క్లారిటీ

పార్టీ మారే విషయంపై గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. దీపావళి తర్వాత ఇప్పుడొస్తున్న వార్తలపై ఒక ప్రకటన చేస్తానని ఆయన చెప్పారు. వంశీ గడిచిన రెండు రోజుల్లో మూడు పార్టీల నాయకులను కలిసే సరికి కార్యకర్తల్లో, ఆయన సన్నిహితుల్లో కొంత గందర గోళ పరిస్ధితి ఏర్పడింది. మొన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో, ఈరోజు ఉదయం బీజేపీ నేత సుజనాచౌదరితో, సాయంత్రం సీఎఁ జగన్‌తో వంశీ భేటీ అయ్యారు.
2006 లో రాజకీయాల్లోకి వచ్చానని, తన అనుచరులపై ఇప్పుడు జరిగినన్ని దాడులు, పోలీసులు పెట్టిన కేసులు గతంలో ఎన్నడూ జరగలేదని ఆయన తెలిపారు. గత నాలుగు నెలలుగా నియోజక వర్గంలో పనులు ఏమీ జరగట్లేదని ఆయన అన్నారు. అక్టోబరు 25న సీఎం జగన్ తో జరిగిన భేటీలో ఈ విషయాలన్నీ చెప్పానని, జగన్ సానుకూలంగా స్పందించారని వంశీ తెలిపారు.
రాష్ట్ర మంత్రి తన పాత మిత్రుడు కొడాలి నాని, పేర్ని నానిలతో కలిసి వంశీ శుక్రవారం సీఎంతో భేటీ అవటంతో పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ భేటీలో తనపై పెట్టిన అక్రమ కేసుల గురించి కూడా వంశీ సీఎం దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. ఈ సమావేశంలో వైసీపీలో చేరేందుకు వంశీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతే వైసీపీ లో చేర్చుకుంటామని సీఎం సూచించినట్లు ఆపార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అందుకు అంగీకరించిన వంశీ దీపావళి తర్వాత రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.