తమ్ముళ్ల తన్నులాట: విశాఖ టీడీపీలో వర్గపోరు

  • Published By: chvmurthy ,Published On : February 23, 2019 / 03:22 PM IST
తమ్ముళ్ల తన్నులాట: విశాఖ టీడీపీలో వర్గపోరు

Updated On : February 23, 2019 / 3:22 PM IST

విశాఖ టీడీపీని అసమ్మతి, వర్గపోరు వేధిస్తోంది. ఇన్నాళ్లుగా నేతల మధ్య ఉన్న అసంతృప్తి ఒక్క సారిగా భగ్గుమంటోంది. సిట్టింగ్‌లకే ఈసారి టిక్కెట్లు కేటాయిస్తే ఓడిస్తామంటూ మరో వర్గం తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. అసలే వలసలతో విలవిల్లాడుతున్న విశాఖ జిల్లా టీడీపీని ఇప్పుడు ఇంటిపోరు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్న అధినేతకు అసమ్మతి కుంపట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సిటింగ్‌ ఎమ్మెల్యేలు, ఇంచార్జులపై, అసమ్మతి నేతలు సెగలు కక్కుతున్నారు. వారికే టిక్కేట్టు ఇస్తే అంతే సంగతులు అని తేల్చి చెబుతున్నారు.

2014 ఎన్నికల్లో విశాఖలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 11 టీడీపీ, బీజేపీ 1, వైసీపీ 3 గెలుచుకున్నాయి. పాడేరు, అరకు ఎమ్మేల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావులు పార్టీ మారి టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం 13కు పెరిగింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇప్పుడు టిక్కెట్ల కేటాయింపుల వేళ అసమ్మతి వర్గం స్వరం పెంచుతోంది. ఇన్నాళ్లు తమపై కర్ర పెత్తనం చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్ ఇస్తే ఊరుకోమని తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు.

పాయకరావుపేట ఎమ్మేల్యే అనితకు వ్యతిరేకంగానూ నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇప్పటికే కొటవృట్లలో అనిత వద్దు టీడీపీ ముద్దు అంటూ అసమ్మతి నేతలు మీటింగ్ పెట్టేశారు. అంతేకాదు పాయకరావు పేట టౌన్ అధ్యక్షుడు నారాయణరావు అనిత వద్దు తెలుగుదేశం ముద్దు అంటూ ర్యాలీ చేపట్టారు. ఆమెపై తీవ్ర అరోపణలు చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం గెలవాలంటే అనితకు బదులు వేరే వారికి టిక్కేట్ ఇవ్వాలని కోరుతున్నారు. అనితకు టికెట్‌ ఇస్తే ఓడించి తీరుతామని, ఆ ప్రభావం అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విజయావకాశాలపై కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారు.

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, నగర టీడీపీ అధ్యక్షుడైన వాసుపల్లి గణేష్‌కుమార్‌కు టికెట్‌ ఇవ్వొద్దని ఆ నియోజకవర్గ మైనారిటీ, మహిళా విభాగాల నేతలు, మాజీ కార్పొరేటర్లు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ  డిమాండ్ చేశారు. గతేడాది వాసుపల్లి తీరుకు నిరసనగా దళిత నేతలు పార్టీ కార్యాలయంలోనే ధర్నాకు దిగారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. తాజాగా వాసుపల్లికి టికెట్‌ ఇస్తే ఓడించి తీరుతామంటూ అర్బన్‌ టీడీపీ మైనార్టీ వింగ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ సాదిక్, మాజీ కార్పొరేటర్‌ చెన్నా రామారావు తదితరులు తేల్చిచెబుతున్నారు. నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతోందని, ప్రశ్నించిన నేతలపై ఎమ్మెల్యే స్వయంగా దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని వారు మండిపడ్డారు.

ఇక గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌పై అక్కడి టీడీపీ సీనియర్‌ నేత, మాజీ కార్పొరేటర్‌ లేళ్ల కోటేశ్వరరావు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకుండా పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టిన వారికి మళ్లీ టికెట్‌ ఇస్తే కార్యకర్తలే ఓడిస్తారని ప్రకటించారు. తాను కూడా టికెట్‌ రేసులో ఉన్నానని తెలిపారు. ఎమ్మెల్యే తీరు వల్లే కోన తాతారావు వంటి నేతలు పార్టీని వీడారని మళ్లీ పల్లాకు టికెట్‌ ఇస్తే చాలా మంది పార్టీని వీడతారంటూ హెచ్చరించారు. మాడుగులలో పార్టీ ఇన్‌చార్జి గవిరెడ్డి రామానాయుడుపై సొంత పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలే గ్రూపు కట్టి తిరుగుబాటు ప్రకటించారు. మాడుగులలో పైకి అంతా సవ్యంగా కనిపిస్తున్నా అసమ్మతి నివురు గప్పిన నిప్పులా ఉంది.

ఇటువంటి పరిస్ధితుల్లో విశాఖ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మరి టీడీపీ అధిష్టానం సిట్టింగ్‌లకే టిక్కెట్‌ ఇస్తుందా.. జెండా మోసిన కార్యకర్తల అభీష్టానికి అనుగుణంగా అభ్యర్ధులను మారుస్తుందా అనేది  వేచి చూడాలి.