టార్గెట్ బొత్స సత్యనారాయణ.. చంద్రబాబు వేస్తున్న స్కెచ్ ఏంటి?
చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొత్సకు ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగోసారి విజయం దక్కనీయకూడదనే ఆలోచనలతో అడుగులు వేస్తున్న టీడీపీ అధిష్టానం ఆశలు నెరవేరుతాయా? బొత్సను టార్గెట్ చేస్తూ టీడీపీ వేస్తున్న స్కెచ్ ఏంటి?

Chandrababu Target Botcha Satyanarayana
Botcha Satyanarayana : వైసీపీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి బొత్సకు చెక్ చెప్పేలా టీడీపీ వ్యూహం మార్చుతోంది. విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా చలామణి అవుతున్న బొత్సకు.. ఈ ఎన్నికల్లో షాక్ ఇచ్చేలా ఓ మహిళా నేతను బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచనతో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొత్సకు ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగోసారి విజయం దక్కనీయకూడదనే ఆలోచనలతో అడుగులు వేస్తున్న టీడీపీ అధిష్టానం ఆశలు నెరవేరుతాయా? బొత్సను టార్గెట్ చేస్తూ టీడీపీ వేస్తున్న స్కెచ్ ఏంటి?
బొత్స ప్రత్యర్థిగా మీసాల గీత?
విజయనగరం జిల్లాలో వైసీపీ అంటే మంత్రి బొత్స కుటుంబమే. మంత్రితోపాటు ఆయన సోదరుడు అప్పలనరసయ్య, సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు గజపతినగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మంత్రి మేనల్లుడు విజయనగరం జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మంత్రి సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మిని తాజాగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించింది వైసీపీ. వచ్చే ఎన్నికల్లో మంత్రి బొత్స మళ్లీ చీపురుపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఐతే ఆయనకు సరైన ప్రత్యర్థిని వెతుకుతున్న టీడీపీ.. తాజాగా విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరును పరిశీలిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
Also Read : నెల్లూరులో కాక.. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు షాక్!
బొత్సను ఢీకొట్టే సామర్థ్యంపై సందేహాలు..
ప్రస్తుతం చీపురుపల్లి టీడీపీ ఇన్‌చార్జిగా కిమిడి నాగార్జున వ్యవహరిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలూ నాగార్జునే చూస్తున్నారు. యువకుడైన నాగార్జున దూకుడుగా వ్యవహరిస్తున్నా.. బొత్సను ఢీకొట్టే సామర్థ్యంపై రాజకీయవర్గాల్లో సందేహాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బొత్సకు ప్రత్యర్థిగా పోటీచేశారు నాగార్జున. సుమారు 20వేల ఓట్ల తేడాతో ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గంలోనే పనిచేస్తున్నా.. మంత్రి బొత్స, ఆయన మేనల్లుడు జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వ్యూహాల ముందు నాగార్జున పనితీరు పెద్దగా ప్రభావం చూపలేకపోతోందని అంటున్నారు పరిశీలకులు.
హాట్ టాపిక్ గా మారిన మీసాల గీత పేరు..
దీంతో టీడీపీ అధిష్టానం చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రత్యామ్నాయం వెతుకుతుందనే టాక్ మొదలైంది. ఇదే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ పేరిట పార్టీ ఐవీఆర్‌ఎస్ విధానంలో కార్యకర్తలు, తటస్థుల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇందులో పక్క నియోజకవర్గానికి చెందిన మీసాల గీత పేరు ఉండటం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.
అశోక్ గజపతిరాజుపై ఆగ్రహంగా ఉన్న గీత..
విజయనగరం ఎమ్మెల్యేగా పనిచేసిన మీసాల గీత.. గత ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయలేదు. ఈసారి కూడా విజయనగరం నుంచి ఆమె పోటీ చేసే చాన్స్ కనిపించడం లేదు. విజయనగరంలో సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు లేదా ఆయన కుమార్తె అదితి గజపతిరాజు పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. 2014లో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే కుమార్తె కోసం తనను పక్కనపెట్టారని అశోక్‌పై ఆగ్రహంగా ఉన్న గీత.. పార్టీ అధిష్టానంతో మాత్రం సత్సంబంధాలనే కొనసాగిస్తున్నారు. అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్‌తో టచ్‌లో ఉంటూ తనకు ప్రత్యామ్నాయం చూపాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే బొత్సపై ఆమెను పోటీ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో సర్వే చేస్తోంది టీడీపీ.
Also Read : నిన్న పవన్ కల్యాణ్.. నేడు నాగబాబు.. టీడీపీ, జనసేన మధ్య అసలేం జరుగుతోంది?
మహిళా సెంటిమెంట్ తో బొత్సకు చెక్..!
వచ్చే ఎన్నికల్లో జనం మెచ్చిన వారే టీడీపీ అభ్యర్థులుగా ఉంటారని అధినేత చంద్రబాబు కూడా గతంలో ప్రకటించడంతో చీపురుపల్లి సీటు మారుతుందనే ప్రచారానికి ఊతమిస్తోంది. ఇన్‌చార్జిగా నాగార్జున అందరికీ అందుబాటులో ఉంటున్నా.. బొత్సను ఢీకొట్టే సామర్థ్యంపైనే సందేహాలు ఉండటం వల్ల క్యాడర్ కాస్త వెనక్కు తగ్గుతున్నారనే విశ్లేషణలు ఉన్నాయి. అదే మహిళా నేతగా మీసాల గీత బరిలో నిలిస్తే మహిళా సెంటిమెంట్‌తో బొత్స కుటుంబాన్ని నిలువరించొచ్చనే అభిప్రాయం వెలువడుతోంది. 2004 నుంచి చీపురుపల్లి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న బొత్స 2014లో మహిళానేత మృణాళినిపై ఓడిపోవడం కూడా ఓ సెంటిమెంట్‌గా భావిస్తున్నారు.