నెల్లూరులో కాక.. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు షాక్!
అనిల్‌కుమార్ యాదవ్‌ను నెల్లూరు సిటీ నుంచి నరసారావుపేట లోక్‌సభ అభ్యర్థిగా పంపడంలో ఎవరి హ్యాండ్ ఉంది? సిటీలో అనిల్‌కు సీన్ లేదన్న వేమిరెడ్డి మాటలను సీఎం జగన్ నమ్మినట్లేనా?

nellore ycp politics anil kumar yadav versus vemireddy prabhakar reddy
Anil Kumar Yadav : నెల్లూరు పాలిటిక్స్‌లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిదే పైచేయి అయిందా? సీఎం జగన్‌కు వీరవిధేయుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను నెల్లూరు సిటీ నుంచి నరసారావుపేట లోక్‌సభ అభ్యర్థిగా పంపడంలో ఎవరి హ్యాండ్ ఉంది? సిటీలో అనిల్‌కు సీన్ లేదన్న వేమిరెడ్డి మాటలను సీఎం జగన్ నమ్మినట్లేనా?
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు సార్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా.. సీఎం జగన్ తొలి మంత్రి వర్గంలో పనిచేసిన అనిల్‌కుమార్‌యాదవ్‌ను నెల్లూరు నుంచి పల్నాడుకు పంపనున్నారనే సమాచారం జిల్లా రాజకీయాల్లో హీట్‌పుట్టిస్తోంది. తాజా పరిణామంతో వైసీపీలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాటకే ఎక్కువ విలువ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కండీషన్ పెట్టిన వేమిరెడ్డి..
నెల్లూరు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి.. వైసీపీలో కీలక నాయకుల్లో ఒకరు. ఆర్థిక బలం ఉన్న నేత. పార్టీ ఆర్థిక వ్యవహారాల్లో వేమిరెడ్డి వెన్నుదన్నుగా నిలుస్తారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి పదవీకాలం.. కొద్దిరోజుల్లో ముగియనుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వేమిరెడ్డిని నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా బరిలో దింపాలని నిర్ణయించింది వైసీపీ.. అయితే తాను ఎంపీగా పోటీ చేయాలంటే.. నియోజకవర్గం పరిధిలో మూడు అసెంబ్లీ సీట్లలో మార్పులు చేయాలని కండీషన్ పెట్టారు వేమిరెడ్డి. దీనిపై గతంలో విస్తృత చర్చ జరిగింది.
వేమిరెడ్డి పట్టుబట్టడమే కారణమా?
నెల్లూరు సిటీలో అనిల్‌కుమార్ యాదవ్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఉదయగిరి ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డిలను మార్చాలని… వీరు వచ్చే ఎన్నికల్లో గెలవరని.. సర్వేల్లో కూడా ఇదే విషయం తేలిందని సీఎం జగన్‌కు ఎంపీ వేమిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది. ఐతే తొలుత వేమిరెడ్డి వాదనను కొట్టిపడేసిన సీఎం జగన్… తాజాగా అనిల్‌కుమార్‌ను నరసారావుపేట లోక్‌సభ అభ్యర్థి నిర్ణయించినట్లు చెబుతున్నారు. సీఎం ఇలా మనసుమార్చుకోడానికి ఎంపీ వేమిరెడ్డి పట్టుబట్టడమే ప్రధాన కారణమని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అనిల్‌కు స్థానచలనం కలగడంతో మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటో అన్న చర్చ మొదలైంది.
Also Read: గుమ్మనూరు జయరాంకు షాక్.. కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా మేయర్ రామయ్య
నరసారావుపేటకు అనిల్?
నెల్లూరులో సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో అనిల్‌కుమార్‌యాదవ్ ఒకరు.. ఇక వేమిరెడ్డి కూడా వైసీపీ ప్రధాన నేతల్లో ముఖ్యులు. ఈ ఇద్దరి మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అనిల్‌కుమార్‌ను నరసారావుపేట పంపడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నరసారావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కొద్ది రోజులు క్రితమే వైసీపీకి రాజీనామా చేశారు. ఆ లోక్‌సభ అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని నిలపాలని భావించిన వైసీపీ హైకమాండ్.. ఒకరిద్దరు బీసీ నేతలు పేర్లు పరిశీలించింది. కానీ అనూహ్యంగా అనిల్‌కుమార్‌యాదవ్ పేరు ఖరారు చేయాలని నిర్ణయించడమే సంచలనం సృష్టిస్తోంది.
Also Read: బరిలో అనిల్ కుమార్ యాదవ్.. నరసరావుపేట పంచాయితీకి పుల్‌స్టాప్ పెట్టిన జగన్
సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన అనిల్‌కుమార్‌కు స్థాన భ్రంశం ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఎంపీ వేమిరెడ్డి తొలుత అనిల్‌కు సీటు ఇవ్వొద్దని చెప్పినా.. సీఎం జగన్ సూచనతో వెనక్కి తగ్గినట్లే కనిపించారు. అయితే ఆయన తెరచాటుగా చక్రం తిప్పడం వల్లే అనిల్‌ను మార్చక తప్పలేదనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి వైసీపీలో వేమిరెడ్డి సత్తా ఏంటో ఈ వ్యవహారంతో స్పష్టమైంది.