Gummanur Jayaram: గుమ్మనూరు జయరాంకు షాక్.. కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా మేయర్ రామయ్య
కాంగ్రెస్ పార్టీలో గుమ్మనూరు జయరాం చేరనున్నట్లు కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో..

Gummanur Jayaram
ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాంను పక్కనబెట్టి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను ఖరారు చేస్తూ వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఆలూరు టికెట్ విషయంలో గుమ్మనూరు జయరాం కొన్ని రోజులుగా అలకబూనిన విషయం తెలిసిందే.
ఆయనను బుజ్జగించేందుకు వైసీపీ చర్యలు చేపట్టినప్పటికీ విఫలమైనట్లు తెలుస్తోంది. మరోవైపు, ఎమ్మిగనూరు అభ్యర్థిగా బుట్టా రేణుకను వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ రెండు స్థానాలను వైసీపీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరును ఇది వరకే వైసీపీ ప్రకటించినప్పటికీ లోక్‌సభకు పోటీ చేయడానికి గుమ్మనూరు జయరాం ఒప్పుకోలేదు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ ఆయనను పక్కన పెడుతోంది. ఇటీవల గుమ్మనూరు జయరాం ఎవరి ఫోన్లకూ స్పందించలేదు. ఇటీవలే మాజీమంత్రి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని ఆయన వద్దకు వైసీపీ అధిష్ఠానం పంపించి చర్చలు జరిపింది. ఎంపీ టికెట్ వద్దని, ఎమ్మెల్యే టికెటే కావాలని గుమ్మనూరు పట్టుబట్టారు.
లేదంటే తన వారసుడు గుమ్మనూరు ఈశ్వర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, అలా చేస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానని జయరాం అన్నట్లు ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో గుమ్మనూరు జయరాం చేరనున్నట్లు కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.