మీ కోటలో చంపేస్తే: జగన్‌కు పవన్ కళ్యాణ్ ప్రశ్నలు

  • Published By: vamsi ,Published On : March 24, 2019 / 02:55 AM IST
మీ కోటలో చంపేస్తే: జగన్‌కు పవన్ కళ్యాణ్ ప్రశ్నలు

Updated On : March 24, 2019 / 2:55 AM IST

ప్రతిపక్ష నేత జగన్‌పై విమర్శల జోరును పెంచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతాన్ని ప్రస్తావించారు.  వైఎస్ వివేకా హత్య విషయంలో జగన్‌కు కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌తో సహా వైసీపీ నాయకులు మధ్యాహ్నం వరకు హత్యను గుంటుపోటుగా ఎందుకు చెప్పారని ప్రశ్నించారు.

కడప, పులివెందుల మీ కోట అని చెప్పుకుంటారు కదా? మీ కోటకు వచ్చి మీ బాబాయిని హత్య చేసి, తర్వాత రక్తపు మరకలను, ఫింగర్ ప్రింట్స్‌ను తుడిచి వెళ్తుంటే నిజంగానే మీకు తెలియలేదా? మీ కోట అని చెప్పుకునే చోట సొంత బాబాయినే కాపాడుకోలేకపోయిన మీరు రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారు? 

ఈ హత్యతో జగన్‌కు ప్రమేయం ఉందని నేను అనడం లేదు. కానీ చూసిన వెంటనే హత్య అని అర్థం అయిపోయే ఈ సంఘటనని ముందు సహజ మరణం అని, గుండెపోటు అని ఎందుకు చెప్పారు? మళ్లీ సాయంత్రానికి గొడ్డలితో నరికి చంపారు అని ఎందుకు అన్నారు. కొన్ని గంటల తర్వాత లెటర్ దొరికింది అన్నారు. మీ ఇంట్లో జరిగిన హత్యకే మీరు ఏం మాట్లాడలేకపోతారా? అంటూ ప్రశ్నించారు. పిన తండ్రి చనిపోయారనే బాధ మీకు ఎందుకు లేదు? సొంత చిన తండ్రి చనిపోతేనే బాధ లేని మీకు ప్రజలపై బాధ్యత ఎలా ఉంటుందని అన్నారు.