బోగస్ ఓట్లపై హైకోర్టులో వాదనలు : పొన్నవోలు సుధాకర్ 

  • Published By: veegamteam ,Published On : February 11, 2019 / 10:23 AM IST
బోగస్ ఓట్లపై హైకోర్టులో వాదనలు : పొన్నవోలు సుధాకర్ 

Updated On : February 11, 2019 / 10:23 AM IST

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో బోగస్ ఓట్లపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో 59 లక్షలకు పైగా బోగస్ ఓట్లపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించినట్లు ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోగస్ ఓట్లపై హైకోర్టులో వాదనలు జరిగాయని తెలిపారు. బోగస్ ఓట్లపై విచారణ జరుపుతున్నామని ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి వివరణ ఇచ్చారని తెలిపారు. ఫిభ్రవరి 20వ తేదీ లోపు బోగస్ ఓట్లను తొలగించడంపై చర్యలు తీసుకుంటామని హైకోర్టు సాక్షిగా అధికారులు హామీ ఇచ్చారని చెప్పారు. దీనిపై పూర్తి సమాచారం అందచేస్తామని హైకోర్టుకు వారు విన్నవించారని గుర్తు చేశారు.

బోగస్‌ ఓట్లపై నాలుగు దశల్లో తాము ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. మొదటి దశలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారని, రెండో దశలో హైకోర్టును ఆశ్రయించామన్నారు. మూడో దశలో నియోజకవర్గాల వారీగా బోగస్ ఓట్లపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చామని చెప్పారు. నాలుగో దశలో ప్రజలను కూడా తమ ఓటుహక్కుపై అవగాహన పెంచి ఓటరు జాబితాలో పేరు ఉందా, లేదా అనేది పరిశీలించుకునేలా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.