జగన్ తీరుని జీర్ణించుకోలేకపోతున్న పార్టీలోని రెడ్డి సామాజిక వర్గం నేతలు, అసలేం జరిగింది

ఏపీలో వైసీపీ అధికారం చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా రెడ్డి సామాజికవర్గానికి న్యాయం జరగలేదని ఆ పార్టీలోని రెడ్డి సామాజికవర్గ నేతలు గగ్గోలు పెడుతున్నారట. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లాలని, అదే సామాజికవర్గానికి చెందిన కొందరు పెద్దలకు కూడా తమ బాధ తెలియజేయాలని ఆ వర్గం నేతలు భావించారట. కాకపోతే జగన్ మాత్రం రాజ్యాధికారం అంటే అధికార సామాజికవర్గం ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలా అని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అధికారం చేపట్టిన నాటి నుంచి పదవుల విషయంలో మొదటి నుంచి జగన్.. బీసీలకే పదవులు కట్టబెడుతున్నారు. పార్టీలో రెడ్డి సామాజికవర్గం, కాపు సామాజిక వర్గాలకు చెందిన సీనియర్లు ఉన్నా బీసీ నేతలను తెరపైకి తెస్తున్నారు. అది కూడా రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్న వారికి ఊహించని పదవులు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
జీర్ణించుకోలేకపోతున్న రెడ్డి సామాజికవర్గం నేతలు:
వైసీపీలో మంత్రుల దగ్గర నుంచి కీలక పదవులు, నామినేటెడ్ పోస్టులు అన్నింటి విషయంలో సీఎం జగన్ ఓ క్లారిటీతో ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా బీసీ నేతలను ముందుంచి ప్రభుత్వాన్ని, పార్టీని ముందుకు తీసుకెళుతున్నారు. ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా బీసీ నేతలు ముందుండి పార్టీకి అండగా ఉంటున్నారు. ఈ విషయం రెడ్డి సామాజికవర్గ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారట. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ హవా కొనసాగుతుందనుకుంటే పూర్తి విరుద్ధగా జరగడంతో ఆ సామాజిక వర్గ నేతల్లో అసహనం పెరుగుతోందని అంటున్నారు. కనీసం ప్రభుత్వంలో కాకపోయినా పార్టీలో అన్నా కొంచెం మంచి పదవులు వస్తాయనుకుంటే అవి కూడా బీసీ నేతలకే కట్టబెడుతుండడటం నచ్చడం లేదంటున్నారు.