బతుకమ్మలో ఉపయోగించే ప్రతీ పువ్వు ఆరోగ్యానికి ప్రతీక

తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకొనే పండుగల్లో బతుకమ్మ ఒకటి. హిందూ సంప్రదాయంలో పువ్వులతో దేవతలను పూజిస్తాం. అయితే పువ్వుల రాశినే దేవతా మూర్తిగా భావించి పూజచేయడం ఈ బతుకమ్మ ప్రత్యేకత. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి పువ్వుల చుట్టూ చప్పట్లు కొడుతూ.. ఏమేమీ పువ్వొప్పనే గౌరమ్మ.. ఏమేమీ కాయొప్పనే గౌరమ్మ అంటూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. అంతేకాదు బతుకమ్మలో ఉపయోగించే పువ్వులు మన ఆరోగ్యానికి, అందానికి ఎంగానో తోడ్పడుతాయి. మరి ఆ పూలేంటో.. వాటితో వచ్చే లాభాలేంటో మీకు తెలుసా?
తంగేడు పూలు:
బతుకమ్మ ముందు వరసలో ఉండేవి తంగేడు పూలు, పసిడి వర్ణంలో మెరిసే వీటిలో ఔషధ గుణాలు ఎక్కువ, తంగేడు పూలు.. జ్వరం, మలబద్దకానికి మంచి ఔషదం. తంగేడు పూలని ఆరబెట్టి దాంట్లో ఉసిరికాయ పొడి, పసుపు సమాన భాగాలుగా తీసుకొని కలపాలి. దీన్ని రెండు పూటలా తినడానికి అరగంట ముందు గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది.
తామర పూలు:
తామర పువ్వు అందానికి, స్వచ్ఛతకు ప్రతీక. దీన్ని రక్తస్రావ నివారణకు ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్యాల తయారీకి, మలబద్దకంతో బాధపడేవారికి తామర తైలం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. తామర పువ్వు రేకులు, కుంకుమపుప్పు, కలువ పువ్వులతో కలిపి ముఖానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు ఈ పువ్వుతో అనేక చర్మ సంబంధ వ్యాధులను నివారించవచ్చు.
గునుగు పూలు:
ఇది గడ్డిజాతికి చెందిన పువ్వు. దీన్ని అతిసార నివారణకు మందుగా వాడుతారు. ఇక బతుకమ్మ అలంకరణలో గునుగు పువ్వు ఎంతో శోభను ఇస్తుంది. ఈ పువ్వును చర్మం పై గాయాలు, పొక్కులు, క్షయవ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. రక్త పోటును అదుపులో ఉంచడంలో దీనికి మరేది సాటిరాదు.
ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ బాగా నీటితో నిండి ఉంటాయి. ఇక రకరకాల పువ్వులు రంగు రంగులో ఆరుబయట పూసి ఉంటాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం గునుగు పూలు, తంగేడు పూలు అలా అన్నీ రకాల పూలను ఉపయోగించి బతుకమ్మను పేరుస్తారు.