షోడశ సంస్కారాలు- దుష్టశక్తుల నుంచి రక్షించేందుకే సీమంతం

Hindu rituals from birth to death : ధర్మశాస్త్రాల్లో 40 సంస్కారాల వరకు చెప్పబడ్డాయి. గౌతమ స్మృతులు-40, అంగీరస మహర్షి-25, వ్యాసుడు-16 సంస్కారాలు పేర్కోన్నారు. ఈసంస్కారాల విషయంలో మత బేధాలున్నాయి. వ్యక్తిని సంస్కరించేవి సంస్కారాలు. సంస్కృతి సంస్కారాలకు దూరమై ఆనందమంటే ఏమిటో తెలియక వ్యక్తులు యాంత్రిక జీవనం చేయట చూస్తే సంస్కృతీ ప్రియులకు బాధ కలుగుతుంది. ఇహ,పరలోక సుఖాల నిమిత్తం సుఖం ఆనందంగా పరిణమించే నిమిత్తం సంస్కారాలు వ్యక్తిని సంస్కార వంతుణ్ణి చేస్తాయి.
మనిషి పుట్టుకనుంచి చనిపోయేవరకు సంస్కారమయమే. ఇందులో అంత్యేష్టి తప్ప మిగిలిన 15 కర్మల ద్వారా జీవుడు సంస్కరింపబడుతూ మరణం తర్వాత ఉత్తమలోక ప్రాప్తిని పొందడం జరుగుతుంది. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడ తొలిగి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిధ్దిస్తుంది. సంస్కారాల ఆచరణ మనిషి జీవితంలో వివాహాంతో మొదలవుతుంది.
అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్రంగా ఏర్పడాలన్నదే. స్త్రీ పురుష సంయోగం మంత్రం చేత పునీతమవుతుంది. అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్రంగా ఏర్పడాలన్నదే. స్త్రీ పురుష సంయోగం మంత్రం చేత పునీతమవుతుంది. తద్వారా మన సంస్కారములు ప్రధానోద్దేశ్యం జీవుల క్షేమమేనని తేటతెల్లమవుతోంది. షోడశ సంస్కారాలు చూస్తే
1. వివాహం : వివాహం సమయంలో వధూవరులచే పలుమంత్రాలు చెప్పించబడుతుంటాయి. ఆ సమయంలో వరుడు, “భగ, ఆర్యమ, సవిత, పురంధి అనే దేవతలు గార్హపత్యం కోసం నిన్ను నాకు అనుగ్రహించగా, నా జీవితం సుఖమయమయ మయ్యేందుకు నీ చేయిని నేను పట్టుకున్నాను” అని చెబుతాడు.
2. గర్భాదానం : స్త్రీ పురష సంయోగం ద్వారా పుట్టబోయే సంతానం యోగ్యులుగా ఉండేందుకై ఈ సంస్కారం నిర్దేశించబడింది.
3. పుంసవనం : తల్లి గర్భంలోని పిండం పవిత్రంగా ఏర్పడేందుకు ఉద్దేశించబడిన సంస్కారమే పుంసవనం.
4. సీమంతం : గర్భవతికి ఈ సంస్కారాన్ని నిర్వహించడం వల్ల దుష్టశక్తుల నుంచి రక్షింపబడుతుంది.
5. జాతకర్మము : బిడ్డకు నెయ్యిని రుచి చూపి, పది నెలలు తల్లి గర్భంలో ఉండి ఈ ప్రపంచానికి వచ్చిన జీవికి జరిపే తొలి సంస్కారం ఇది.
6. నామకరణం : బిడ్డ ఈ సమాజంలో తనకంటూ ఓ వ్యక్తిత్వంతో వౄద్ధిలోకి రావాలన్న కోరికతో తల్లి దండ్రులు జరిపే సంస్కారం.
7. నిష్ర్కమణ : బిడ్దను తొలిసారిగా బయటకు తీసుకెళ్ళడం, చంటిబిడ్డను విభిన్న వాతావరణాలకు పరిచYఅం చేయడమో ఈ సంస్కారంలోని అంతరార్ధం.
8. అన్నప్రాశనం : బిడ్డకు బలవర్ధకమైన, ఆహారాన్ని పరిచయం చేయడం.
9. చూడాకర్మ : పుట్టువెంట్రుకలను తీయించడం ఈ సంస్కారంలోని ప్రత్యేకత.
10. కర్ణబేధ : చెవులు కుట్టించడం.
11. ఉపనయనం : బాల బ్రహ్మచారికి జరిపే సంస్కారం.
12. వేదారంభం : సమవర్తన సంస్కారాన్ని చక్కగా ముగించేందుకే వేదారంభం.
13. సమావర్తనం : పిల్లలు విద్య ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ సంస్కారం జరుపబడుతుంది.
14. వానప్రస్ధం : బాధ్యతలను వారసులకు అప్పగించి వచ్చే జన్మకై జరిపే కర్మ.
15. సన్యాసం : ఐహిక బంధాల నుంచి తప్పుకుని దైవ చింతనలో గడపడం.
ఈ షోడశ సంస్కారాల్లో ఒకటైన సీమంతం గురించి తెలుసుకుందాం. ఈ సంస్కారాన్ని కూడా గర్భిణీస్త్రీకే జరుపుతారు. సీమంతోన్నయనం అనగా కేశాలని ఎత్తికట్టడం. పాపటను ఏర్పరచడం. దీనికే ఫలస్నపనమని ఇంకొకపేరు కూడా వుంది. గర్భిణీస్త్రీని ఆవహించుకుని వుండే దుష్టశక్తుల బారినుంచి గర్భిణీ స్త్రీని రక్షించుకొనేందుకే ఈ సంస్కారం చేయాలని శాస్త్రం.
పుంసవనమూ, సీమంతోన్నయనమూ ఈరెండు సంస్కారాలూ గర్భరక్షణ కోసం చేస్తారు. ఈ సంస్కారం ఏ మాసంలో జరిపించాలనే దానిమీద భిన్న వాదనలున్నా, తొలిచూలులో నాలుగు/ ఆరు/ ఎనిమిదవ మాసంలో ఈ సంస్కారం జరిపించాలని శాస్త్ర వచనం. ఒకవేళ తొలిచూలులో వీలుకాకపోతే రెండవ గర్భధారణ సమయంలో చేయాలని నియమం. ఈ సంస్కారాన్ని ఆ మాసంలోని శుక్లపక్షంలో, పురుష నక్షత్రాలలో అనగా అశ్వని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, మఖ, హస్త, అనురాధ, శ్రవణం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర అను నక్షత్రాలలో జరిపించాలి.
సంస్కార విధానం: శుభదినాన, ఉదయాన్నే, గణపతి పూజ, పుణ్యహవాచనాలను జరిపించి, సంకల్పం చెప్పుకుని రక్షాబంధనము చేసి, సంతాన ప్రదాతలగు విష్ణువుకీ, త్వష్ట ప్రజాపతికీ, ఇతర దేవతలకూ హవిస్సులర్పించి, హోమగుండానికి పడమరవైపు తూర్పుముఖంగా గర్భిణీస్త్రీని కూర్చుండబెట్టి, అత్తిపండ్లగుత్తులు, ఇతర సమిధలు కలిపి ఆమె పాపటిని రేపాలి. తరువాత సంబంధిత వేదమంత్రాలను పఠిస్తూ మొలకెత్తిన యవధాన్యాల దండను ఆమె కొప్పునకు చుట్టాలి. ఆ తరువాత పాపిటను కుంకుమతో అలంకరించి, తూర్పు లేక ఉత్తరదిశగా దంపతులిద్దరూ నడచి అక్కడవున్న కోడెదూడను తాకి నమస్కరించాలి.
తరువాత, ఒక రాగిపాత్రలో వడ్లనుగానీ, యవధాన్యాన్నిగానీ వుంచి, విష్ణుర్యోనింకల్పయతు త్వష్టా రూపాణిపింశతు మొదలైన ఏడు ఋగ్వేదమంత్రాలను పఠిస్తూ, భర్త, గర్భిణీస్త్రీకి ఏడు దోసిళ్ళతో ఆ నీరు తాగించాలి. తర్వాత కుటుంబాచారాలను ఆచరించి, అందరి ఆశీర్వచనాలను తీసుకుని అందరికీ యథాశక్తి భోజనాదులనో లేక ఫలతాంబూలాదులనో సమర్పించాలి.