Magha Purnima 2025 : మాఘ పౌర్ణమి విశిష్టత ఏంటి? ఎప్పుడు ప్రారంభమైంది, ఏం చేయాలి, ఏ ఆలయానికి వెళ్లాలి..

దేవతలు తమ సర్వ శక్తులను, తేజస్సును మాఘ మాసంలో జలాల్లో ఉంచుతారు. అందువల్ల..

Magha Purnima 2025 : మాఘ పౌర్ణమి విశిష్టత ఏంటి? ఎప్పుడు ప్రారంభమైంది, ఏం చేయాలి, ఏ ఆలయానికి వెళ్లాలి..

Updated On : February 11, 2025 / 8:42 PM IST

Magha Purnima 2025 : మాఘ పౌర్ణమి.. దీని విశిష్టత ఏంటి? మాఘ పౌర్ణమి రోజున ఏం చేయాలి? ఎలాంటి స్నానం ఆచరించాలి? అలా చేయడం వల్ల కలిగే శుభాలు ఏంటి.. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నాగరాజు మాటల్లో తెలుసుకుందాం..

”మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా అంటారు. అన్ని పౌర్ణమిలలోకెల్లా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది. మాఘ పౌర్ణమి రోజున ప్రతీ ఒక్కరూ సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయాలి. దేవతలు తమ సర్వ శక్తులను, తేజస్సును మాఘ మాసంలో జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘ స్నానం చాలా మంచిది.

దగ్గరలో నది లేని వారు కనీసం చెరువులో కానీ, కొలనులో కానీ లేక బావి దగ్గర కానీ స్నానం ఆచరించాలి. మాఘ స్నానం ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం ఉంటుందని కూడా అంటారు. స్నానాంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి నమస్కరించాలి. వైష్ణవ ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలి.

Also Read : ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో వైభవంగా సమతా కుంభ్-2025 ఆధ్యాత్మిక వేడుకలు..

అత్యంత భక్తిశ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. ఈ రోజున గొడుగులు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలితం ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు, దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్ష్యాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తోంది.

మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానాల వలన, పూజల వలన, దానాల వలన వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఆ పణ్య ఫలాల విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది. మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. గంగేచ, యమునైచ, గోదావరి, సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అనే శ్లోకం పటిస్తూ స్నానం ఆచరించాలి” అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.