Maha Shivratri 2024: శివుడు లింగాకారంగా ఆవిర్భవించిన పర్వదినం..

శివుడు మహాలింగ ఆకారంలో ఉద్భవించడానికి వెనుక ఉన్న కథేంటో కూడా పురాణాల్లో స్పష్టంగా..

Maha Shivratri 2024: శివుడు లింగాకారంగా ఆవిర్భవించిన పర్వదినం..

Maha Shivaratri

మహాశివరాత్రి.. హిందూ పండుగలలో అతిముఖ్యమైనది, ప్రశస్తమైనది. శివ,పార్వతుల వివాహం జరిగిన రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటాం. పండుగనాడు రాత్రి శివుడు తాండవం చేస్తాడు. హిందువుల క్యాలెండర్ లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు.

కానీ వింటర్ సీజన్ ముగిసి.. సమ్మర్ లో మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ప్రతిఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది మహాశివరాత్రి. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణాలలో ఉంది.

మహాశివరాత్రి నాడు శివుడికి బిల్వ ఆకులు సమర్పించి భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహిస్తారు భక్తులు. ఆ రోజంతా ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేస్తారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. మహాశివరాత్రి రోజు రాత్రంతా.. దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివాలయాలు, జ్యోతిర్లింగాలలో అభిషేకాలు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది. ఓం నమః శివాయ పవిత్ర మంత్రం పఠిస్తూ భక్తిపారవశ్యంలో మునిగి తేలుతారు భక్తులు.

అత్యంత పవిత్రదినం
తెలంగాణ, ఏపీ, కర్నాటక, కేరళ, తమిళనాడులో మహాశివరాత్రి అత్యంత పవిత్రదినం. శివుడ్ని ఆది గురువుగా భావిస్తారు. శివుడి నుంచే యోగ సంప్రదాయం ఉద్భవించిందనేది నమ్మకం. మహా శివరాత్రి రోజున శివుడు లింగ రూపంలో భూమి మీద కనిపిస్తాడు. అందుకే ఆరోజుల అన్ని శివాలయాల్లో అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు.

మధ్య, ఉత్తర భారతదేశంలో మహా శివరాత్రికి ప్రత్యేకత ఉంది. ఉజ్జయినీలోని మహాకాళేశ్వర్ దేవాలయం..మహాశివరాత్రి రోజు కిక్కిరిసిపోతుంది. జబల్పూర్ లోని తిల్వారా ఘాట్, జియోనారలో మఠం ఆలయంలో సియోనీ పేరుతో వైభవంగా ఈ పండుగను చేసుకుంటారు.

నేపాల్ లో కోట్లాది హిందువుల ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయానికి.. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు శివరాత్రికి తరలివస్తారు. బంగ్లాదేశ్ లోని హిందువులు కూడా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉంటే మంచి భర్త లేదా భార్యను పొందుతామని బంగ్లాదేశ్ హిందువుల నమ్మకం.

శివుడికి అభిషేకం
శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయడమనేది అత్యంత పవిత్రమైందిగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినం చేసుకుంటున్నాం. అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటామనే సందేహాలకు పురాణాలే సమాధానాలు చెప్తాయి. పురాణకాలంలో దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తారు. ఆ క్రమంలో ముందు బయటకు వచ్చిన గరళాన్ని శివుడు మింగేస్తాడు.

ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అందుకు ఆయనకు నిద్ర రాకుండా దేవతలు, అసురులందరూ కలసి రాత్రంతా ఆడిపాడుతారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు.. వారు ఆడపాడిన ఐదు జాములకాలాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఆ రోజు ఉపవాసం, జాగారణలతో భక్తులు శివారాధన చేయడం ఆనవాయితీ. ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు.

మహాశివుడే రంగంలోకి దిగి..
లింగోద్భావం ఎందుకు నిర్వహిస్తారు..శివుడు మహాలింగ ఆకారంలో ఉద్భవించడానికి వెనుక ఉన్న కథేంటో కూడా పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. సకల జీవరాశుల తలరాతలు రాసేది తానేనని.. సృష్టిని సృష్టించేది తాను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ వాదిస్తాడు. నువ్వు కూర్చున్న చోటు నుంచి ఎటూవెళ్లవు.

కాలు కదపకుండా తలరాతలు రాస్తే సరిపోతుందా లోకాలన్ని తిరిగి రకరకాల అవతారాలలో పర్యవేక్షిస్తూ పాలించేది నేనని.. కాబట్టి తానే గొప్పఅంటాడు విష్ణువు. వీరి గొడవ ఎంతకీ తెగకపోవడంతో దానిని తీర్చేందుకు మహాశివుడే రంగంలోకి దిగుతాడు. ఒక చోట అగ్ని స్తంభం ఉందని.. దాని ఆది అంతములు ఎవరు కనుక్కుంటే వారే గొప్ప అని చెబుతాడు మహాశివుడు.

ఆ అగ్నిస్తంభం ఆద్యంతాలు తెలుసుకోవడానికి బ్రహ్మవిష్ణువులు బయలుదేరుతారు. ఆది కోసం బ్రహ్మ, అంతం కోసం విష్ణువులు వెతుకుతారు. ఎంత ప్రయత్నించినా దాని అంతం కనుక్కోలేక విష్ణుమూర్తి ఓటమిని అంగీకరించి శివుడి దగ్గరికి బయల్దేరుతాడు. దారిలో బ్రహ్మ కామధేనువును, మొగలిపువ్వును చూసి అగ్నిస్తంభం మొదలు కనుక్కున్నానని చెప్తాడు. ఇద్దరూ ఓచోట చేరిన తర్వాత.. అగ్నిస్తంభం తానేనని.. దానికి ఆద్యంతాలు లేవని చెప్తాడు శివుడు.

దీంతో తమ కంటే శివుడే గొప్పవాడని గ్రహించిన బ్రహ్మ, విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుడిని పంచాక్షరి మంత్రం చదువుతూ మారేడు దళాలతో పూజిస్తారు. వెంటనే శివుడు ప్రత్యక్షమై.. అన్ని నేనే అంతటా నేనే.. నన్ను పూజించిన వారికి నా అండ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్తాడు. అదే శివరాత్రి. శివుడు లింగరూపంలో ఉద్భవించిన రోజు.

మాఘమాసం ఆరుద్ర నక్షత్రంలో శివుడు లింగరూపంలో ఉద్భవించాడని భావిస్తారు. నాటి నుంచి ప్రతి మాఘమాస అమావాస్య రోజున మహాశివరాత్రి పర్వదినంగా ఆచరిస్తున్నారు. శివలింగానికి రుద్రాభిషేకం చేసి.. ఉదయం నుంచి ఉపవాసం, జాగారం చేస్తే అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

తెలంగాణలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల