తిరుమల లడ్డూ ఎఫెక్ట్..! దేశంలోని అన్ని ఆలయాల్లో మరింత శుద్ధితో ప్రసాదాలు తయారీ..

బయటి సంస్థలు తయారు చేసిన ప్రసాదాలను బాలరాముడికి నైవేద్యంగా పెట్టడాన్ని ఆలయం ట్రస్ట్ నిషేధించింది.

తిరుమల లడ్డూ ఎఫెక్ట్..! దేశంలోని అన్ని ఆలయాల్లో మరింత శుద్ధితో ప్రసాదాలు తయారీ..

Tirumala Laddu (Photo Credit : Google)

Updated On : September 28, 2024 / 12:12 AM IST

Ttd Laddu Row : తిరుమల లడ్డూ వివాదం ఏపీలో ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. అధికార, విపక్షం మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇది ఇలా ఉంటే.. దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలపై తిరుమల లడ్డూ ఎఫెక్ట్ పడింది. సాక్ష్యాత్తు వేంకటేశ్వర స్వామి ఆలయంలోనే లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారంటూ ఆరోపణలు రావడంతో దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లోని అధికారులు అప్రమత్తం అయ్యారు. దేవుని ప్రసాదాన్ని మరింత శుద్ధితో తయారు చేయడానికి సిద్ధమవుతున్నారు.

తిరుమల లడ్డూ వివాదం ఎఫెక్ట్ అయోధ్య రామ మందిరంపైనా పడింది. బయటి సంస్థలు తయారు చేసిన ప్రసాదాలను బాలరాముడికి నైవేద్యంగా పెట్టడాన్ని ఆలయం ట్రస్ట్ నిషేధించింది. ఆలయ పూజారుల సమక్షంలో తయారు చేసిన ప్రసాదాలను మాత్రమే బాలరాముడికి నైవేద్యంగా పెట్టాలని, భక్తులకు ప్రసాదంగా అందించాలని అయోధ్య ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు, మఠాలు.. బయట ఏజెన్సీలు తయారు చేసిన ప్రసాదాలను పూర్తిగా నిషేధించాలన్నారు.

Also Read : జగన్ తిరుమల పర్యటన రద్దుపై ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు..

తిరుమల లడ్డూ వ్యవహారంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ప్రసాదాల తయారీలు, అందులో వాడే పదార్ధాలపై ఫోకస్ పెట్టాయి. ఆలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి ప్రసాదాల నాణ్యతను పరిశీలిస్తున్నారు.

ప్రయాగ్ రాజ్ సంఘం సిటీలోని అలోప్ శాంకరీ దేవి, బడే హనుమాన్, మన్ కామేశ్వర్ సహా అనేక ఆలయాల్లో భక్తులు బయట కొన్న స్వీట్లను ఆలయంలోకి తేవడంపై నిషేధం విధించారు. భక్తులు కేవలం టెంకాయలు, పూలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ మాత్రమే తేవాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. సంఘం సిటీలోని టెంపుల్ కారిడార్ పూర్తైన తర్వాత ఆలయ ట్రస్టులే ప్రసాదంగా లడ్డూ, పేడా తయారు చేసేలా డిసైడ్ అయ్యారు.

ఇక లక్నోలోని కొన్ని ఆలయాల్లో ఇప్పటికే బయట కొన్న ప్రసాదాలపై నిషేధం విధించారు. భక్తులు తమ ఇళ్లలో తయారు చేసిన ప్రసాదాలనే ఆలయాలకు తీసుకురావాలని నిబంధన పెట్టారు. ఇక తెలంగాణలోని అన్ని ఆలయాలలోని ప్రసాదాలను నాణ్యతా ప్రమాణాలు పరిశీలించేందుకు ల్యాబ్ కి పంపారు. నాణ్యత ప్రమాణాలను పరిశీలించాకే ఎక్కడికక్కడ ప్రసాదాల తయారీ విషయంలో నాణ్యతపైన, ఆలయాల పవిత్రను కాపాడటంపైన దృష్టి సారించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఇలా.. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం.. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది.