Tirumala : టీటీడీ చెప్పేదొకటి..చేసేదొకటి..భక్తుల ఆగ్రహం, సర్వదర్శనం టోకెన్ల జారీలో గందరగోళం!
భక్తుల మనోభావాలను టీటీడీ దెబ్బ తీస్తోందని తిరుపతి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో ముందుగా టికెట్టు జారీ చేశామంటున్న..

Ttd
Tirumala Vaikunta Dwaram Darshan : వైకుంఠ ఏకాదశితో పాటు సంక్రాంతి పండుగ రోజుల్లో తిరుమల శ్రీవాని దర్శించుకోవాలన్న భక్తులకు నిరాశే ఎదురైంది. తిరుపతిలోని స్థానికుల కోసం 2022, జనవరి 10వ తేదీ సోమవారం ఉదయం నుంచి ఇవ్వాల్సి టోకెన్లు టీటీడీ అధికారులు గత రాత్రే జారీ చేశారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి టోకెన్ జారీ కేంద్రాల్లో వేచివున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 13న వైకుంఠ ఏకాదశి, 14న ద్వాదశితో పాటు మిగిలిన 8 రోజులు.. స్థానిక భక్తులకు రోజుకు 5 వేల చొప్పున మొత్తం 50 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన ఐదు కేంద్రాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
Read More : Novak Djokovic : జకోవిచ్‌కు ఊరట, అనుకూలంగా తీర్పు
నగరంలోని రామచంద్ర పుష్కరిణి, బైరాగపట్టడి, ఎమ్మార్‌పల్లి, మున్సిపల్ కార్యాలయం, సత్యనారాయణపురం ప్రభుత్వ పాఠశాలలో సర్వదర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాస్తవానికి సోమవారం ఉదయం టోకెన్లు జారీ చేస్తామని ముందుగా టీటీడీ ప్రకటించింది. అయితే.. భక్తులు ఆదివారం రాత్రి నుంచే పెద్దఎత్తున తరలిరావడంతో రాత్రి 9 గంటల నుంచే టోకెన్లు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో ముందుగానే టోకెన్లు జారీ చేశామని చెప్పడంపై భక్తులు మండిపడుతున్నారు. ముందుగానే సర్వదన్శనం టోకెన్ల జారీ వెనుక ఏదో కుంభకోణం ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు. టీటీడీ చెప్పేదొకటి.. చేసేది మరొకటిలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలను టీటీడీ దెబ్బ తీస్తోందని తిరుపతి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో ముందుగా టికెట్టు జారీ చేశామంటున్న అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.