Viral Video: మ్యాచ్‌ జరుగుతోంటే.. గ్రౌండ్‌లోకి వచ్చిన పాము.. పరిగెత్తండ్రా బాబోయ్..

పామును గమనించిన వెంటనే అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు.

Viral Video: మ్యాచ్‌ జరుగుతోంటే.. గ్రౌండ్‌లోకి వచ్చిన పాము.. పరిగెత్తండ్రా బాబోయ్..

Updated On : July 3, 2025 / 6:44 PM IST

శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య హోరాహోరీగా వన్డే మ్యాచ్ జరుగుతోంది. బంగ్లాదేశ్ బ్యాటర్లు పరుగుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతలో, మైదానంలోకి ఎవరూ ఊహించని ఒక “అతిథి” ప్రవేశించింది. అది ఎవరో కాదు, ఏకంగా 7 అడుగుల పొడవైన పాము. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ ఘటనతో ఆటగాళ్లతో పాటు, ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. బౌండరీ లైన్ వద్ద పామును గమనించిన వెంటనే అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు.

గ్రౌండ్ సిబ్బంది వెంటనే స్పందించి, పాముకు ఎలాంటి హాని కలగకుండా, ఎవరినీ గాయపరచకుండా దానిని జాగ్రత్తగా మైదానం నుంచి బయటకు పంపించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని నిమిషాల అంతరాయం తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైనప్పటికీ, ఈ “పాము” ఎపిసోడ్ మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

శ్రీలంక క్రికెట్ గ్రౌండ్‌లలో పాములు కనిపించడం ఇదేమీ కొత్త కాదు. గతంలో లంకా ప్రీమియర్ లీగ్ (LPL) మ్యాచ్‌ల సమయంలో కూడా ఇలాంటి ఘటనలు చాలాసార్లు జరిగాయి.

ఈ ఊహించని సంఘటన పక్కన పెడితే, మ్యాచ్ కూడా అంతే డ్రామాటిక్‌గా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

Also Read: మైండ్‌ బ్లోయింగ్.. డాక్టర్ల కంటే 4 రెట్లు బెటర్.. మైక్రోసాఫ్ట్ కొత్త మెడికల్ AI.. ఇక మనుషుల అవసరం లేదా?

సెంచరీతో ఆదుకున్న అసలంక

ఓపెనర్లు పథుమ్ నిస్సాంకా (0), నిషాన్ మదుష్క (6) విఫలమైనప్పటికీ, మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ కుసాల్ మెండిస్ (45), చరిథ్ అసలంక అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా, అసలంక బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో అద్భుతమైన సెంచరీ (106) సాధించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు (244) అందించాడు. బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ 4 వికెట్లతో శ్రీలంకను కట్టడి చేయగా, తన్జీమ్ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: చేతులెత్తేసిన బ్యాటర్లు

శ్రీలంక ఇచ్చిన 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్ తన్జీద్ హసన్ (62) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఒక దశలో బంగ్లాదేశ్ సులభంగా గెలుస్తుందనిపించింది. కానీ, శ్రీలంక బౌలర్లు ఒక్కసారిగా పుంజుకున్నారు.

పేకమేడలా కూలిన మిడిల్ ఆర్డర్: లిటన్ దాస్ (0), మెహిదీ హసన్ మిరాజ్ (0), తోహిద్ హ్రిదాయ్ (1) వంటి కీలక బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. చివరికి 167 పరుగులకే ఆలౌట్ అయ్యింది. చివరికి, శ్రీలంక 77 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.