అబ్బురపర్చిన పారా ఆర్చర్ శీతల్ ప్రదర్శన.. అప్పట్లో ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరించాలని ఆనంద్ మహీంద్ర విజ్ఞప్తి
ఆమె వీడియోను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేస్తూ.. గతంలో తాను ఆమెకు ఇచ్చిన ఓ మాటను గుర్తుచేసుకున్నారు.

పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్ 2024లో భారత ఆర్చర్ శీతల్ దేవి (17) ప్రదర్శన అందరినీ అబ్బురపరుస్తోంది. మహిళల వ్యక్తిగత విభాగంలో ఆమె తొలి షాట్‌లో ఇచ్చిన ప్రదర్శనకు 10 పాయింట్లు దక్కాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కొద్ది తేడాతో పతకాన్ని కోల్పోయినప్పటికీ ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె వీడియోను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేస్తూ.. గతంలో తాను ఆమెకు ఇచ్చిన ఓ మాటను గుర్తుచేసుకున్నారు.
‘‘అసాధారణ ధైర్యం, నిబద్ధత, ఎన్నటికీ వెనకడుగువేయని స్ఫూర్తికి పతకాలతో సంబంధం ఉండదు. నువ్వు దేశానికి, మొత్తం ప్రపంచానికి ఎంతో స్ఫూర్తిదాయకం. దాదాపు ఒక సంవత్సరం క్రితం.. నీ అలుపెరగని స్ఫూర్తికి సెల్యూట్ చేస్తూ మా సంస్థ కార్ల నుంచి ఏదైనా కారుని తీసుకోవాలని చెప్పాను. నీకు తగ్గ కారును డిజైన్ చేయిస్తానని తెలిపాను.
నీకు 18 ఏళ్లు నిండిన తర్వాత నా ఆఫర్‌ను అంగీకరిస్తానని చెప్పావు. నీకు వచ్చే ఏడాది 18 ఏళ్లు వస్తాయి. నేను నీకు ఇచ్చిన మాటను నెరవేర్చాలని ఎదురు చూస్తున్నాను. నా మండే మోటివేషన్‌కు నిన్ను మించినవారు ఎవరూ లేరు’’ అని ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు.
కాగా, రెండు చేతులు లేకపోయినా శీతల్ దేవి కాళ్లతో బాణాలు వేసిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చుతోంది. ఆమె సొంత రాష్ట్రం జమ్మూకశ్మీర్ కాగా, ఆమెకు ఫొకోమేలియా అనే రుగ్మత కారణంగా చేతులు పెరగలేదు. అయినప్పటికీ కాళ్లతోనే అన్ని పనులు చేసుకుంటుంది. గత ఆసియా క్రీడల్లో 2 బంగారు పతకాలు గెలుచుకుంది. అప్పట్లోనే ఆమెకు కారు ఇస్తానని ఆనంద్ మహీంద్రా ప్రామిస్ చేశారు.
Extraordinary courage, commitment & a never-give-up spirit are not linked to medals…#SheetalDevi, you are a beacon of inspiration for the country—and the entire world.
Almost a year ago, as a salute to your indomitable spirit, I had requested you to accept any car from our… pic.twitter.com/LDpaEOolxA
— anand mahindra (@anandmahindra) September 2, 2024