IND vs SL : నిప్పులు చెరిగిన సిరాజ్.. ఆసియా కప్ మనదే
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది.

Ind vs SL
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది.
LIVE NEWS & UPDATES
-
టీమ్ఇండియా ఘన విజయం
కొలంబోని ప్రేమదాస వేదికగా శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (23), శుభ్‌మన్ గిల్ (27) మిగతా బ్యాటర్లకు అవకాశం ఇవ్వకుండా లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో భారత్ ఎనిమిదో సారి ఆసియా కప్‌ను ముద్దాడింది.
-
గిల్, ఇషాన్ చెరో ఫోర్
పతిరణ వేసిన ఐదో ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. ఇషాన్ కిషన్, గిల్ చెరో ఫోర్ బాదారు. 5 ఓవర్లకు భారత స్కోరు 45/0. గిల్ (23), ఇషాన్ కిషన్ (21) లు క్రీజులో ఉన్నారు.
-
దూకుడుగా ఆడుతున్న ఓపెనర్లు
51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత బ్యాటర్లు బరిలోకి దిగారు. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లు వచ్చారు. ప్రమోద్ వేసిన మొదటి ఓవర్‌లో 7 పరుగులు రాగా, పతిరణ వేసిన రెండో ఓవర్‌లో 10 పరుగులు రాబట్టారు. ప్రమోద్ వేసిన మూడో ఓవర్‌లో గిల్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టడంతో ఈ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయ. 3 ఓవర్లకు భారత స్కోరు 32/0. గిల్ (18), ఇషాన్ కిషన్ (13) లు క్రీజులో ఉన్నారు.
-
శ్రీలంక 50 ఆలౌట్
భారత బౌలర్ల ధాటికి శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. లంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్ (17), దుషన్ హేమంత (13) మాత్రమే రెండు అంకెల స్కోర్లు చేశారు. ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్ ఆరు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా హార్దిక్ పాండ్య మూడు, బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు.
-
దునిత్ వెల్లలాగే ఔట్
టీమ్ఇండియా పేసర్ల ధాటికి లంక బ్యాటర్లు విలవిలలాడుతున్నారు. క్రీజులో కుదురుకోలేక పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో (12.3వ ఓవర్)లో దునిత్ వెల్లలాగే(8) కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో లంక 40 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
-
సిరాజ్‌కు మరో వికెట్
శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో (11.2వ ఓవర్)లో కుశాల్ మెండీస్ (17; 34 బంతుల్లో 3 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో శ్రీలంక 33 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.
-
శనక ఔట్..
మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ఆడేందుకు లంక బ్యాటర్లు ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా పెవిలియన్‌కు చేరుకుంటున్నారు. ఆదుకుంటాడు అని భావించిన కెప్టెన్ శనక (0) సైతం సిరాజ్ బౌలింగ్‌లో (5.4వ ఓవర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇది సిరాజ్‌కు ఈ మ్యాచ్‌లో ఐదో వికెట్ కావడం గమనార్హం. దీంతో లంక 12 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. 6 ఓవర్లకు లంక స్కోరు 13/6. దునిత్ వెల్లలాగే (1), కుశాల్ మెండీస్ (5) లు క్రీజులో ఉన్నారు.
-
ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన సిరాజ్..
శ్రీలంకకు మహ్మద్ సిరాజ్ గట్టి షాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీశాడు. నాలుగో ఓవర్ వేసిన సిరాజ్ మొదటి బంతికి పాథుమ్ నిశాంక (2; 4 బంతుల్లో) ను ఔట్ చేయగా మూడో బంతికి సదీరా సమరవిక్రమ(0)ను ఎల్భీ డబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చాడు. నాలుగో బంతికి అసలంక (1) ఇషాన్ కిషన్ చేతికి చిక్కాడు. ఐదో బంతిని ఫోర్‌గా మలిచిన ధనుంజయ డిసిల్వా (4) ఆఖరి బంతికి రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో లంక 12 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 4 ఓవర్లకు లంక స్కోరు 12/5.
-
మొదటి ఓవర్‌లోనే లంకకు షాక్..
ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియాకు శుభారంభం లభించింది. మొదటి ఓవర్‌లోనే లంక వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో(0.3వ ఓవర్) కుశాల్ పెరీరా (0) కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో శ్రీలంక ఒక్క పరుగుకే ఒక్క వికెట్ కోల్పోయింది. 1 ఓవర్‌కు లంక స్కోరు 7/1. కుశాల్ మెండీస్ (5), పాథుమ్ నిశాంక (1) లు క్రీజులో ఉన్నారు.
-
వరుణుడు వచ్చేశాడు
అనుకున్నట్లుగా ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు వచ్చేశాడు. టాస్ వేసిన అనంతరం మ్యాచ్ ఆరంభించేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు సిద్ధం అవుతున్న సమయంలో వర్షం పడుతోంది. వెంటనే సిబ్బంది పిచ్‌తో పాటు గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పేశారు.
-
శ్రీలంక తుది జట్టు
పథుమ్ నిశాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, డాసున్ శానక, దునిత్ వెల్లలాగే, దుషాన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరన, ధనుంజయ డిసిల్వా
-
భారత తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
-
టాస్ గెలిచిన లంక
టీమ్ఇండియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు టాస్ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ శనక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయపడ్డ మహేశ్ తీక్షణ స్థానంలో దుషాన్ హేమంత జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు.