Asia Cup 2025: ఆసియా కప్.. ఫైనల్స్ చేరిన పాకిస్తాన్.. భారత్ తో అమీతుమీ..
136 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాను పాక్ బౌలర్లు కట్టడి చేశారు.

Courtesy @ ESPNcricinfo
Asia Cup 2025: ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ ఫైనల్స్ చేరింది. తుదిపోరులో భారత్ తో తలపడనుంది. సూపర్ ఫోర్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించింది. 11 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్ కి చేరుకుంది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేసింది. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో మహమ్మద్ హారిస్ (31), షాహీన్ అఫ్రిదీ (19), నవాజ్ (25) పాక్‌ను ఆదుకున్నారు. బంగ్లా ముందు ఛాలెంజింగ్ స్కోర్ ఉంచగలిగారు. బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు.
136 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాను పాక్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేసింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ, హారిస్ రౌఫ్ తలో మూడు వికెట్లు తీశారు. అయుబ్ 2 వికెట్లు పడగొట్టాడు.