బాక్సింగ్ డే టెస్టు: లంచ్ విరామానికి 131పరుగుల ఆధిక్యంలో టీమిండియా

బాక్సింగ్ డే టెస్టు: లంచ్ విరామానికి 131పరుగుల ఆధిక్యంలో టీమిండియా

Updated On : December 28, 2020 / 7:45 AM IST

బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియా మరోసారి ఆధిక్యాన్ని కొనసాగించింది. తొలి టెస్టు పరాభవం తర్వాత బలంగా పుంజుకున్న ఇండియా జట్టు.. ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. లంచ్ విరామానాకి టీమిండియా 131 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రహానె అజేయంగా సెంచరీకి మించి స్కోరు చేసి జట్టుకే హైలెట్ గా నిలిచాడు. కెప్టెన్‌ రహానె (104 బ్యాటింగ్‌; 200 బంతుల్లో) అజేయంగా సెంచరీ సాధించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ఆఖరుకు భారత్‌.. 5 వికెట్లకు 277 పరుగులు సాధించింది. మిగతా బ్యాట్స్‌మెన్‌ శుభారంభాలను భారీస్కోర్లుగా మలచడంలో విఫలమైనప్పటికీ.. రహానె కెరీర్లోనే నిలిచిపోయే సెంచరీతో అలరించాడు. కష్టాల్లో పడ్డట్లు కనిపించిన జట్టును జడేజా (40)తో కలిసి ఆదుకున్నాడు. అరంగేట్ర ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (45; 65 బంతుల్లో ) కూడా ఆకట్టుకున్నాడు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ (2/61), కమిన్స్‌ (2/71) చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

రెండో రోజు ఆట ఆరంభమైన తీరు చూస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్కోరును భారత్‌ అందుకోలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉదయం పూట పిచ్‌ సహకారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యర్థి పేసర్లు చెలరేగారు. ముఖ్యంగా కమిన్స్‌ మరోసారి భారత బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ గిల్‌, పుజారా (17)లను ఔట్‌ చేసి భారత్‌ను దెబ్బకొట్టాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 36/1తో ఆట మొదలెట్టిన భారత్‌కు తొలి బంతికే కమిన్స్‌ షాక్‌ ఇచ్చేలా కనిపించాడు.

పుజారా బ్యాట్‌ను తాకి బంతి చేతుల్లో పడిందని పైన్‌ రివ్యూ కోరాడు. భారత్‌కు అనుకూలంగా వచ్చింది. ఆ తర్వాతి ఓవర్లోనే గిల్‌ క్యాచ్‌ను డైవ్‌ చేసిన పైన్‌ వదిలేశాడు. కానీ కమిన్స్‌ తాను వేసిన వరుస ఓవర్లలో గిల్‌, పుజారాలను పెవిలియన్‌ చేర్చాడు. కుడివైపునకు డైవ్‌ చేస్తూ పైన్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు పుజారా వెనుదిరిగాడు. ఆ దశలో మరో వికెట్‌ పడి ఉంటే భారత్‌ పరిస్థితి మరింత క్లిష్టంగా మారేది. కానీ రహానె, విహారి (21) జోడీ ఆచితూచి ఆడడంతో జట్టు 90/3తో లంచ్‌ విరామానికి వెళ్లింది.

రహానె హైలెట్స్:
* బాక్సింగ్‌ డే టెస్టుల్లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రహానె నిలిచాడు. అంతకుముందు 2014లో మెల్‌బోర్న్‌లోనే జరిగిన బాక్సిండ్‌ డే టెస్టులోనూ సెంచరీ సాధించాడు.

* ఎంసీజీలో సెంచరీ చేసిన రెండో భారత కెప్టెన్‌గా రహానె నిలిచాడు. 1999 బాక్సింగ్‌ డే టెస్టులో అప్పటి కెప్టెన్‌ సచిన్‌ సెంచరీ బాదాడు.

* మెల్‌బోర్న్‌లో రెండు సెంచరీలు చేసిన రెండో భారత క్రికెటర్‌ రహానేనే. 1947-48 పర్యటనలో ఎంసీజీలో వినూ మాన్కడ్‌ రెండు సెంచరీలు సాధించాడు. 2004లో యూసుఫ్‌ (పాక్‌) తర్వాత ఎంసీజీలో సెంచరీ చేసిన తొలి విదేశీ ఆటగాడు రహానేనే.