అతనితో పోల్చొద్దు: కోహ్లీ అంత.. కాదంటోన్న పాక్ క్రికెటర్

పాకిస్తాన్ స్టార్ క్రికెటర్‌గా ఎదుగుతోన్న బాబర్ అజామ్ తనను టీమిండియా కెప్టెన్, వరల్డ్ నెం.1 బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీతో పోల్చడంపై మండిపడుతున్నాడు. క్రికెట్ అభిమానులు, పాక్ అభిమానులు బాబర్ అజామ్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ 24ఏళ్ల టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ జట్టులో కొన్నేళ్లుగా కోహ్లీలాగే కీలక ప్లేయర్‌గా మారాడు. అన్ని ఫార్మాట్‌లలో దూకుడుగా పరుగులు సాధిస్తుండటంతో అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది.
‘నేను ఇప్పటికీ చాలా సార్లు విన్నాను. నన్ను విరాట్ కోహ్లీతో పోలుస్తున్నారు. అది నాకు నచ్చడం లేదు. నేను అతన్ని దగ్గరిలో కూడా లేను. ఇప్పటికే కోహ్లీ ఎంతో సాధించాడు. నేను ఇప్పుడే కెరీర్‌ను మొదలుపెట్టా. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఒకవేళ భవిష్యత్‌లో కోహ్లీ అంత సాధిస్తే అప్పుడు అతనితో పోల్చండి. ఇప్పుడు కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
బాబర్ అజామ్ అంతర్జాతీయ క్రికెట్‌లో తాను ఒకడు అనే ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. వన్డే, టీ20లలో అద్బుతంగా రాణిస్తూ.. టీ20ల్లో వేగవంతమైన వెయ్యి పరుగులు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకూ 59వన్డేలు ఆడిన బాబర్ అజామ్ 2,462పరుగులు చేశాడు. వీటిలో ఎనిమిది సెంచరీలు కూడా ఉన్నాయి. కోహ్లీ అన్ని మ్యాచ్‌లు ఆడినప్పుడు అతని వ్యక్తిగత స్కోరు అజామ్ కంటే 300పరుగులు తక్కువగానే ఉంది.