Cricket Match : కుప్పకూలిన బ్యాట్స్‌మ‌న్‌.. ఔట్ చెయ్యకుండా మానవత్వం చాటుకున్న ప్రత్యర్థి టీమ్

Cricket Match : కుప్పకూలిన బ్యాట్స్‌మ‌న్‌.. ఔట్ చెయ్యకుండా మానవత్వం చాటుకున్న ప్రత్యర్థి టీమ్

Cricket Match

Updated On : July 18, 2021 / 2:11 PM IST

Cricket Match : క్రికెట్ లో ఆటగాళ్లు గాయపడటం అనేది తరచుగా జరుగుతూనే ఉంటుంది. బ్యాట్స్‌మ‌న్‌ గాయపడి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పరుగుతీస్తున్న సమయంలో గాయపడి మధ్యలోనే ఆగిపోతే రన్ అవుట్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ యార్క్‌షైర్, లాంక‌షైర్ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆలా జరగలేదు.

పరుగుతీస్తున్న సమయంలో లాంక‌షైర్ బ్యాట్స్‌మ‌న్‌ స్టీవెన్ క్రాఫ్ట్ ఒక్కసారిగా కిందపడ్డారు. కాలికి బలమైన గాయం కావడంతో అతడు నిలబడలేకపోయాడు. గాయమై కిందపడిన బ్యాట్స్‌మ‌న్‌ను ర‌నౌట్ చేయొద్ద‌ని కెప్టెన్ జో రూట్ తెలిపాడు. దీంతో కీపర్ బంతిని తన చేతిలో పట్టుకొని అలానే ఉండిపోయాడు. జో రూట్ తీసుకున్న నిర్ణయం ప్రేక్షకుల చేత మన్నన పొందేలా చేసింది.

ఆలోపే ఫీల్డ‌ర్ త్రో విసిరినా.. కెప్టెన్ జో రూట్ వ‌ద్ద‌ని చెప్ప‌డంతో వికెట్ కీప‌ర్ హ్యారీ డ్యూక్‌ రన్ అవుట్ చెయ్యలేదు. ఇదీ అస‌లైన‌ క్రీడాస్ఫూర్తి అంటూ నెటిజ‌న్లు జో రూట్ టీమ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. కాగా ఆ సమయంలో లాంక‌షైర్ జట్టు 18 బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉంది. స్టీవెన్ క్రాఫ్ట్ ని అవుట్ చేస్తే యార్క్‌షైర్ గెలిచే అవకాశం ఉండేది. కానీ ఆ జట్టు కెప్టెన్ మానవత్వంతో రన్ అవుట్ చేయకపోవడంతో జట్టు ఓటమి చవిచూసింది.