BCCI : 1,47,000 మొక్కలను నాటిన బీసీసీఐ.. సరిగ్గా అన్నే మొక్కలను ఎందుకు నాటారంటే..?
పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించిన బీసీసీఐ.. ఇచ్చిన మాట ప్రకారం 1,47,000 మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు సహకారాన్ని అందించింది.
BCCI planted trees : ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సంపన్నమైన బోర్డుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కొనసాగుతోంది. అలాంటి బీసీసీఐ మాట ఇస్తే తప్పుతుందా చెప్పండి. పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించిన బీసీసీఐ.. ఇచ్చిన మాట ప్రకారం 1,47,000 మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు సహకారాన్ని అందించింది. నాలుగు రాష్ట్రాల్లో ఈ మొక్కలను బీసీసీఐ ఆధ్వర్యంలో నాటారు. అసలు బీసీసీఐ ఎప్పుడు మాట ఇచ్చిందో తెలుసా..? సరిగ్గా 1,47,000 మొక్కలను ఎందుకు నాటిందో ఇప్పుడు చూద్దాం..
294 డాట్ బాల్స్..
ఐపీఎల్ 2023 సీజన్ జరిగే సమయంలో బీసీసీఐ పర్యావరణ పరిరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్లే ఆఫ్స్ మ్యాచుల్లో నమోదయ్యే ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కల చొప్పున నాటాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్లే ఆఫ్ మ్యాచుల్లో స్కోర్ బోర్డుపై (Score Board) డాట్ బాల్స్ స్థానంలో మొక్కల సింబల్ కనిపించిన సంగతి తెలిసిందే.
ఏ మ్యాచులో ఎన్ని డాట్ బాల్స్ అంటే..
తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో 84 డాట్ బాల్స్(42 వేల మొక్కలు) నమోదు కాగా.. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో 96 డాట్ బాల్స్ (48 వేల మొక్కలు) నమోదు అయ్యాయి. గుజరాట్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్ మ్యాచులో 67 డాట్ బాల్స్ (26 వేల 500 మొక్కలు), చెన్నైసూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచులో 47 డాట్ బాల్స్ (22వేల 500 మొక్కలు) నమోదు అయ్యాయి.
క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2, ఫైనల్ మ్యాచుల్లో మొత్తం 294 డాట్ బాల్స్ నమోదు అయ్యాయి. ఒక్కొ డాట్ బాల్‌కు 500 మొక్కల చొప్పున 294 డాట్ బాల్స్‌కు 1,47,000 మొక్కలను బీసీసీఐ, టాటా గ్రూపుల సంయుక్త ఆధ్వర్యంలో కేరళ, కర్ణాటక, అస్సాం, గుజరాత్ రాష్ట్రాల్లో నాటారు.
1,00,000వ మొక్క ఎక్కడ నాటారంటే..?
గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో 1,00,000వ మొక్కను నాటారు. ఈ మొక్కను బీసీసీఐ కార్యదర్శి జై షా నాటారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఐపీఎల్ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం బీసీసీణ చేసిన పనిపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
The TATA IPL Green Dot Balls initiative celebrated a landmark moment at the Narendra Modi Stadium as Mr. @JayShah, Hon. Secretary of BCCI, planted the 1,00,000th sapling. With the joint efforts of the Board & TATA Group, a total of 1,47,000 trees are being planted across four… pic.twitter.com/6Q1CWzOYMs
— IndianPremierLeague (@IPL) September 28, 2023