Rajasthan Royals : సూర్యవంశీ శతకంతో గుజరాత్ పై గెలిచిన రాజస్థాన్‌కు భారీ షాక్.. ముంబైతో మ్యాచ్‌కు స్టార్ ఆటగాడు దూరం..
గెలుపు జోష్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. సోమవారం సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 210 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 25 పరుగులు ఉండగానే అందుకుంది. ఆర్ఆర్ విజయంలో 14 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు. 35 బంతుల్లోనే సెంచరీ చేసి చేశాడు.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (84; 50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (50 నాటౌట్; 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో మహేశ్ తీక్షణ రెండు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం వైభవ్ సూర్యవంశీ (101; 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లు) విధ్వంసకర శతకానికి తోడు యశస్వి జైస్వాల్ (70; 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో లక్ష్యాన్ని రాజస్థాన్ 15.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఇది మూడో విజయం కావడం గమనార్హం.
కాగా.. ఈ సీజన్‌లో రాజస్థాన్ మరో నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆర్ఆర్ విజయం సాధించినా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టడం చాలా కష్టం. ఆర్ఆర్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఈ నాలుగు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో విజయం సాధించాలి. అదే సమయంలో చాలా మ్యాచ్‌ల్లో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న జట్లు ఓడిపోవాల్సి ఉంటుంది.
ఇదిలాఉంటే.. రాజస్థాన్ తన తదుపరి మ్యాచ్‌ను మే 1 గురువారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా.. గుజరాత్ పై గెలుపు జోష్‌లో ఉన్న రాజస్థాన్‌కు ఓ ఎదురుదెబ్బ తగిలింది. ముంబైతో మ్యాచ్‌కు కూడా సంజూ శాంసన్ దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పక్కటెముకల గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోకపోవడమే ఇందుకు కారణం.
ఏప్రిల్ 16న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌లో సంజూ శాంసన్ పక్కటెముల గాయానికి గురైయ్యాడు. దీంతో అతడు లక్నో, ఆర్‌సీబీ, గుజరాత్ మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ముంబైతో మ్యాచ్‌లో అతడు ఆడుతాడని తొలుత భావించగా ఇప్పుడు అది కష్టమేనని తెలుస్తోంది.
ఏప్రిల్ 30న సంజూ శాంసన్‌కు ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆ పరీక్షలో అతడు పాస్ అయితే ముంబైతో మ్యాచ్‌లో అతడు ఆడతాడు. ఒకవేళ అతడు దూరం అయితే.. గెలుపు జోష్ ను కంటిన్యూ చేయాలని భావిస్తున్న రాజస్థాన్‌కు అది గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.