బ్రావో గాయంతో తర్వాతి మ్యాచ్ కు దూరం?

చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలకు బ్రేక్ పడడంతో పాటు ఆ జట్టు ఆల్ రౌండర్ డేన్ బ్రావో గాయం మరింత కష్టాల్లో పడేలా చేసింది. ముంబై వేదికగా బుధవారం జరిగిన చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ లో చెన్నై 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన మీడియా సమావేశంలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇలా మాట్లాడాడు.
‘బ్రావో కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. ఇప్పటికే జట్టులో ప్లేయర్లు గాయాలపాలైయ్యారు. ఈ నొప్పితో అతను తర్వాత మ్యాచ్ ఆడతాడా అనేది సందేహంగానే ఉంది. డేవిడ్ విల్లే వ్యక్తిగత కారణాల దృష్ట్యా జట్టుకు దూరమైయ్యాడు. లుంగీ ఎంగిడీ రాలేనని ముందుగానే చెప్పేశాడు. తర్వాతి మ్యాచ్ మైదానాన్ని బట్టి ప్లేయర్లను ఎంచుకోవాలి’ అని వెల్లడించాడు.
సీఎస్కేకు కలిసిరాని రోజు:
ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై విజయం.. చెన్నైకు షాక్ ఇచ్చింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది రోహిత్ సేన. ఆరంభంలోనే వికెట్లు పోగొట్టుకుని 50 పరుగులకు 3 వికెట్లు నష్టపోయి క్లిష్టపరిస్థితుల్లో పడింది ముంబై. కుప్పకూలిపోతున్న ఇన్నింగ్స్ ను సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా నిలబెట్టారు. చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ లు స్కోరు బోర్డును అనూహ్యంగా పరుగులు పెట్టించారు.
చెన్నై సూపర్ కింగ్స్ లో కేదర్ జాదవ్ హిట్టింగ్ మినహాయించి మరెవ్వరూ అనుకున్నంత రాణించలేకపోవడంతో పరాభవం తప్పలేదు. చెన్నై తర్వాతి మ్యాచ్ చిదంబరం స్వామి స్టేడియం వేదికగా ఏప్రిల్ 6వ తేదీ పంజాబ్ జట్టుతో ఆడనుంది.