Team India : ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు.. టీ20 ప్రపంచకప్ 2026 భారత జట్టులో..
అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ (Team India )గెలుచుకుంది.
Changes in India squad from T20 World Cup 2024 to 2026
Team India : అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ గెలుచుకుంది. ఫైనల్ లో దక్షిణాఫ్రికాను ఓడించి కప్పును ముద్దాడింది. ఇక ఇప్పుడు 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెడుతున్న భారత్ తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఉంది. స్వదేశంలోనే టీ20ప్రపంచకప్ 2026 జరగనుండడం భారత్‌కు అతి పెద్ద సానుకూలాంశం.
ఒకవేళ భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026 కైవసం చేసుకుంటే పలు రికార్డులు సృష్టిస్తుంది. టీ20 ప్రపంచ కప్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా మెన్ ఇన్ బ్లూ రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటి వరకు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఏ జట్టు కూడా టీ20 ప్రపంచకప్‌ను నిలబెట్టుకోలేదు. ఇక సొంతగడ్డపై టీ20 కిరీటాన్ని గెలుచుకున్న తొలి జట్టుగా, మూడు టీ20 టైటిళ్లను గెలుచుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డులకు ఎక్కనుంది.
7 గురు కొత్త ముఖాలు..
టీ20 ప్రపంచకప్ 2024, టీ20 ప్రపంచకప్ 2026లలో భారత జట్లను పరిశీలిస్తే.. ఏడుగురు కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. 2024లో టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరితో పాటు ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, పేసర్ మహ్మద్ సిరాజ్ లు 2024 టీ20 ప్రపంచకప్ జట్టులో ఉన్నారు. అయితే.. వీరు 2026 టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.
ఓపెనర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్, స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ, ఫినిషర్ రింకూ సింగ్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లు 2026 ప్రపంచ కప్‌లో భాగం కానున్నారు. రింకూసింగ్, శుభ్‌మన్ గిల్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ లు 2024 టీ20 ప్రపంచకప్ లో రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపిక అయ్యారు గానీ ప్రధాన జట్టులో భాగం కాదు అనే విషయాన్ని గమనించాలి.
2024 టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , అర్ష్ దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. ఎవరెవరు ఇన్? ఎవరెవరు ఔట్?
2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)
