Cheteshwar Pujara : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. బీసీసీఐ, సెలక్టర్లకు పుజారా మెసేజ్.. ఆస్ట్రేలియాలో ఓడిపోయారు.. ఇప్పుడు..
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు మరో రెండు నెలల సమయం ఉన్నప్పటికి సీనియర్ ఆటగాడు పుజారా బీసీసీఐకి ఓ సందేశం పంపాడు.

టీమ్ఇండియా ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని గెలిచిన జోష్‌లో ఉంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండడంతో మరో రెండు నెలల వరకు భారత జట్టుకు ఎలాంటి టోర్నీలు లేవు. ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-2027 సైకిల్ ఈ సిరీస్ నుంచే ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో భారత జట్టు ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో అవమానకర ఓటమి ఎదురుకావడంతో కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మలకు ఇంగ్లాండ్ సిరీస్ ను సవాల్ గా తీసుకున్నారు. ఈ సిరీస్‌లో విజయం సాధించాలని కోరుకుంటున్నారు. 2007 నుంచి భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డ పై ఇప్పటి వరకు టెస్టు సిరీస్‌ను నెగ్గలేదు. చివరి సారి విరాట్ కోహ్లీ సారథ్యంలో 2021లో 2-2 తో సిరీస్ డ్రా గా ముగిసింది.
నేను సిద్ధం..
ఇంగ్లాండ్ సిరీస్‌కు మరో రెండు నెలల సమయం ఉన్నప్పటికి సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా సెలక్టర్లకు ఓ సందేశం పంపాడు. జట్టుకు అవసరం ఉందని అనుకుంటే తాను ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు రెవ్‌స్పోర్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. దేశవాలీ క్రికెట్‌లోనూ రాణిస్తున్న విషయాన్ని గుర్తు చేశాడు. జాతీయ జట్టులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఏమైన అవకాశం ఉంటే తాను సిద్ధంగా ఉంటానన్నాడు.
ఓ క్రికెటర్‌గా ఎల్లప్పుడూ భారత జట్టుకు ఆడాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. రీ ఎంట్రీ కోసం తాను చేయాల్సిందంతా చేస్తున్నట్లు తెలిపాడు. ‘జట్టుకు అవసరం అయితే.. నేను ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాను. దేశవాలీ క్రికెట్ ఆడుతున్నాను. గత రెండేళ్లుగా కౌంటీ క్రికెట్ ఆడుతన్నాను. దేశవాలీలో భారీ స్కోర్ చేస్తున్నాను. కాబట్టి అవకాశం వస్తే.. నేను దాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా.’ అని పుజారా తెలిపాడు.
పుజారా చివరి సారిగా భారత జట్టు తరుపున ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)2023 ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాటి ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. కాగా.. 2024 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతడిని ఎంపిక చేసి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదని పుజారా అభిప్రాయపడ్డాడు.
తనకు చాలా నమ్మకం ఉందని, ఆసీస్ పర్యటనలో తాను ఉండి ఉంటే.. ముచ్చటగా మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచేవాళ్లమని పుజారా చెప్పాడు. ఇక ఇంగ్లాండ్‌ను వారి సొంత గడ్డ పై ఓడించడం ఓ సవాల్ అని పుజారా చెప్పాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందన్నాడు. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లు రిటైర్ అవ్వడంతో వారి బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా మారిందన్నాడు. భారత జట్టుకు ఇది సువర్ణావకాశం అని చెప్పాడు.