Gautam Gambhir : ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తరువాత.. గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం.. ఆటగాళ్లు జర జాగ్రత్త..!
ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తరువాత టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Gautam Gambhir wants to go with India A on England tour After Champions Trophy 2025 win
దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గౌతమ్ గంభీర్ టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే.. ఆరంభంలో గంభీర్‌కు ఏదీ కలిసి రాలేదు. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ ఓటమి, స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో వైట్ వాష్, ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ సిరీస్ ను కోల్పోవడం జరిగింది. ఈ క్రమంలో గంభీర్ పై విమర్శలు వచ్చాయి. దీంతో కోచ్‌గా గంభీర్ కెరీర్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కీలకంగా మారింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు విజేతగా నిలిచింది. 12 ఏళ్ల తరువాత ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. దీంతో పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సక్సెస్ కావడంతో ఇప్పుడు గంభీర్ రెడ్ బాల్ క్రికెట్ పై దృష్టి పెట్టాడు. టెస్టుల్లో స్వదేశంలో కివీస్ చేతిలో ఓటమి, ఆస్ట్రేలియా గడ్డ పై బోర్డర్ గ్రవాస్కర్ ట్రోఫీని నిలుపుకోవడంలో విఫలం కావడంతో గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
భారత ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. ఐపీఎల్ ముగిసిన తరువాత జూన్‌లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ 2025-27) మొదలు కానుంది.
కాగా.. సీనియర్ జట్టు కంటే ముందే భారత ఏ జట్టు ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో భారత ఏ జట్టుతో పాటు గంభీర్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ALSO Read : Rohit sharma : ఏమయ్యా రోహిత్ ఏందిది.. ఫోన్, పాస్‌పోర్టు గతం.. ఛాంపియన్స్ ట్రోఫీని కూడానా..
ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తరువాత నుంచి ఇదే విషయం పై బీసీసీఐతో గంభీర్ చర్చలు జరుపుతున్నాడట. భారత ఏ జట్టుతో ప్రయాణిస్తే.. టీమ్ఇండియా రిజ్వర్ బెంచ్ ను మరింత బలంగా మార్చుకోవచ్చునని గంభీర్ భావిస్తున్నాడట. ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా వచ్చాకనే భారత్ ఏ పర్యటనల్లో పరిపూర్ణమైన సిరీస్‌లను నిర్వహించారు అనే విషయాన్ని గంభీర్ గుర్తించాడు. అవి ప్రధాన టూర్‌లకు ప్రతిబింబంగా ఉండేవి. అందుకనే భారత ఏ జట్టుతో వెళ్తే ప్రయోజనం ఉంటుందని గంభీర్ అనుకుంటున్నాడట.
ఇదే గనుక జరిగితే.. ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోని భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొందరు ఆటగాళ్లను పక్కన బెట్టి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇందుకు ఆస్ట్రేలియా పర్యటనే ఉదాహరణ.. పట్టుబట్టి నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణాలను ఆసీస్ పర్యటనకు తీసుకువెళ్లాడు. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి తన ఆల్‌రౌండ్ నైపుణ్యాలతో అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
2007 నుంచి ఒక్కసారి కూడా..
2007 తరువాత ఇంగ్లాండ్ గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్‌లను గెలవలేదు. భారత జట్టు చివరి సారిగా 2021లో ఇంగ్లాండ్‌లో పర్యటించింది. అప్పుడు కోహ్లీ సారథ్యంలో ఆడగా 2-2తో సిరీస్ సమం అయింది. ఓ దశలో భారత్ 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచినప్పటికి.. అప్పుడు కొవిడ్ వల్ల చివరి టెస్టును రద్దు చేశారు. ఆ తరువాత ఆ టెస్టు మ్యాచ్‌ను 2022 జూలైలో షెడ్యూల్ చేయగా.. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో సిరీస్ డ్రా గా ముగిసింది.