ఆసక్తికరంగా క్రికెటర్ల పొలిటికల్ ఎంట్రీ.. చర్చనీయాంశంగా యూసుఫ్ పఠాన్ నియోజకవర్గం

క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాకపోయినా.. ప్రతీ ఎన్నికలప్పుడు ఒకరిద్దరి పొలిటికల్ ఎంట్రీతో రాజకీయాలకు కొత్త గ్లామర్ తోడవుతుంది.

ఆసక్తికరంగా క్రికెటర్ల పొలిటికల్ ఎంట్రీ.. చర్చనీయాంశంగా యూసుఫ్ పఠాన్ నియోజకవర్గం

Indian cricketers political journey full details here

Indian cricketers political journey: పాలిటిక్స్. ఎప్పుడూ సమ్ థింగ్ స్పెషలే. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చేవాళ్లు కొందరైతే…వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చేవారు మరికొందరు. ఇప్పుడు వివిధ రంగాల్లో ఉన్నవారు కూడా పాలిటిక్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చేవాళ్లే ఎక్కువగా ఉండేవాళ్లు. లేటెస్ట్ గా క్రికెటర్ల పొలిటికల్ ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాకపోయినా.. ప్రతీ ఎన్నికలప్పుడు ఒకరిద్దరి పొలిటికల్ ఎంట్రీతో రాజకీయాలకు కొత్త గ్లామర్ తోడవుతుంది.

స్టేడియంలో దేశం కోసం క్రికెట్ ఆడి.. ప్రజాజీవితంలో ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన క్రికెటర్ల సంఖ్య పదుల సంఖ్యలోనే ఉంది. గతంలోనూ ఎంతోమంది క్రికెటర్లు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిచారు. కొందరు మొదటి ప్రయత్నాల్లో ఓటమి పాలై.. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అజారుద్దీన్ నుంచి హర్భజన్ సింగ్ వరకు.. గౌతమ్ గంభీర్ నుంచి యూసఫ్ పఠాన్ వరకు మరెందరో పాలిటిక్స్ పై ఆసక్తి చూపుతున్నారు.


బలమైన నేత మీద పోటీ

చాన్నాళ్ల కిందే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన మాజీ ఆల్‌రౌండ‌ర్‌ యూసుఫ్ పఠాన్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. పశ్చిమబెంగాల్ లోని బహరాంపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు యూసఫ్ పఠాన్. ఎలాంటి అనౌన్స్‌మెంట్‌ లేకుండా రాజకీయాల్లోకి రావడమేకాదు నేరుగా టిక్కెట్ కూడా దక్కించుకున్నారు. ఇక యూసుఫ్ పఠాన్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కూడా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి స్థానిక ఎంపీగా ఉన్నారు. అంతటి బలమైన నేత మీద యూసుఫ్ పఠాన్‌ను మమత పోటీగా దించడం వైరల్‌గా మారింది.


ష‌మీ పొలిటికల్ ఎంట్రీ?

టీమిండియా క్రికెట‌ర్ మ‌హమద్ ష‌మీ రాజ‌కీయాల్లోకి వచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న బెంగాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది బెంగాల్ జ‌ట్టు త‌ర‌పున రంజీ ట్రోఫీలో ష‌మీ ప్రాతినిధ్యం వ‌హించాడు. అయితే రాజ‌కీయ ఎంట్రీపై ఇప్పటి వరకు ష‌మీ మాత్రం అధికారిక ప్రకటన చేయ‌లేదు. కానీ బెంగాల్ నుంచి ఆయ‌న పోటీ చేయడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్రికెట్ లో గాయ‌ప‌డ్డ ష‌మీ.. స‌ర్జరీ నుంచి కోలుకుంటున్నారు. స్పీడ్‌గా కోలుకోవాలని ప్రధాని మోదీ అత‌నికి విషెస్ కూడా చెప్పారు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా పొలిటికల్ టచ్ ఇచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి.. డైరెక్టుగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా 2012లో యూపీఏ-2 హయాంలో ఆయను రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2012-18 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు సచిన్. క్రికెట్ హిస్టరీలో సచిన్ ది ఓ చెరగని అధ్యాయమనే చెప్పొచ్చు.

క్రికెటర్ మనోజ్ తివారీ పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. అదే ఏడాది షిబ్ పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి దీదీ కేబినెట్ లో మంత్రి అయ్యారు. 2011లో ఇండియన్ టీమ్ లోకి చేరాడు. కొద్దికాలమే క్రికెట్ లో కొనసాగిన మంచి ట్రాక్ రికార్డును సంపాదించాడు.


పాలిటిక్స్‌కి సారీ చెప్పిన
గంభీర్

క్రికెటర్ గౌతమ్ గంభీర్ 2019లో బీజేపీలో చేరి ఎంపీ అయ్యాడు. గత ఎన్నిక‌ల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన గంభీర్‌.. ఈటర్మ్‌ మాత్రం పాలిటిక్స్‌కి సారీ చెప్పేశారు.. ఐపీఎల్ కోసమే గంభీర్ ఈసారి ఎన్నికల్లో నిల్చునేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

హర్భజన్ సింగ్ ఈ మధ్యే రాజకీయాల్లోకి వచ్చాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అతడ్ని రాజ్యసభకు నామినేట్ చేసింది. హర్భజన్ 1998 నుంచి 2016 వరకు భారతదేశం తరపున ఆఫ్ స్పిన్ బౌలర్‌గా ఆడాడు . ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లలోనూ కొనసాగాడు, 2007 T20 ప్రపంచ కప్, 2011 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్లలో తనదైన ఆటశైలితో ఆకట్టుకున్నాడు హర్భజన్ సింగ్.


ఒడిదుడుకులు
ఎదుర్కొన్న సిద్ధూ

మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా రాజకీయాల్లోకి వచ్చి పలు పదవులు చేపట్టారు. 2004లో బీజేపీలో చేరి పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. పంజాబ్ రాష్ట్రమంత్రిగా, తర్వాత అమృత్ సర్ నుంచి ఎంపీగా పనిచేశారు. 2016లో పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. అదే సంవత్సరం పదవికి రాజీనామా చేసి బీజేపీని విడిచిపెట్టాడు. 2017లో కాంగ్రెస్‌లో చేరి.. అమృత్‌సర్ తూర్పు నుంచి పంజాబ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో అమృత్‌సర్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. భారత్ తరఫున 51 టెస్టులు, 136 వన్డేలు ఆడిన సిద్ధూ.. రాజకీయాల్లోకి వచ్చాక అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.

మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ.. వరుస ఓటమి
భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ రాజకీయాల్లోకి వచ్చిన తొలి క్రికెటర్లలో ఒకరు. నవాబ్ రెండు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో పటౌడీ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మొదట హర్యానాలోని భివానీ నుంచి పోటీ చేసి మాజీ ముఖ్యమంత్రి బన్సీ లాల్ చేతిలో ఓడిపోయారు. తర్వాత 1991లో కాంగ్రెస్ టిక్కెట్‌పై భోపాల్ నుంచి పోటీ చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అతని కోసం ప్రచారం చేసినప్పటికీ.. ఎన్నికల్లో ఓడిపోయారు మన్సూర్ అలీఖాన్ పటౌడీ.

భారత క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరైన.. మహమ్మద్ కైఫ్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. 2000 నుంచి 2006 మధ్య 125 వన్డేలు, 13 టెస్టులు ఆడిన మహమ్మద్ కైఫ్, కాంగ్రెస్‌లో చేరి, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్పూర్ నుంచి పోటీ చేశారు. యూపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ అభ్యర్థి కేశవ్ ప్రసాద్ మౌర్య చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత 2018లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరయ్యాడు.


అజారుద్దీన్
పొలిటికల్ ఇన్నింగ్స్‌

2009లో కాంగ్రెస్‌లో చేరి.. తన తన పొలిటికల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ . 2009 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని మొరాదాబాద్ నుంచి అజహర్ ఎంపీగా గెలిచారు. 2014 వరకు ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అజారుద్దీన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. 47 టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహించారు. అయితే 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకోవడంతో ఆయనపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు అజారుద్దీన్.

మూడుసార్లు గెలిచిన కీర్తి ఆజాద్‌ 
మాజీ ఆల్‌రౌండర్‌ కీర్తి ఆజాద్‌ బీహార్‌లోని దర్భంగా నుంచి బీజేపీ తరఫున మూడుసార్లు గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. కీర్తి ఆజాద్ 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో తన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. 2019 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో చేరారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి భగవత్ ఝా ఆజాద్ కుమారుడు కీర్తి ఆజాద్. దూకుడుగా ఆడే రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. ఆఫ్ స్పిన్నర్ కూడా. గతంలో ఢిల్లీలోని గోలే మార్కెట్ నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు.

మాజీ పేసర్ శ్రీశాంత్ 2006లో కేరళలోని తిరువంతపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2007 నుంచి 2011 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆడాడు. 2013 ఐపీఎల్ లో ఆయనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. తర్వాత శ్రీశాంత్ నిర్ధోషిగా తేల్చింది కోర్టు.

Also Read: భయ్యా.. నిన్ను ధోనీ పూనాడా ఏంటి..! వీడియో వైరల్

భారత మాజీ టెస్టు బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లీ లోక్‌భారతి పార్టీలో చేరారు. 2009లో ముంబైలోని విఖ్‌క్రోలి నుంచి పోటీచేసి ఓడిపోయారు. టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఇండియన్ బ్యాట్స్‌మెన్ గా రికార్డు క్రియేట్ చేశాడు. 23 సంవత్సరాల వయస్సులోనే తన చివరి టెస్ట్ ఆడాడు వినోద్ కాంబ్లీ.

మనోజ్ ప్రభాకర్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత బీజేపీలో చేరారు. అతను 39 టెస్టులు, 130 వన్డేలు ఆడారు. కెరీర్ లో 3వేల 4వందల కంటే ఎక్కువ పరుగులు చేసి.. 253 వికెట్లు పడగొట్టారు. 1985 వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్,1984 ఆసియా కప్, 1990-91 ఆసియా కప్, 1995 ఆసియా కప్ గెలవడంలోనూ మనోజ్ ప్రభాకర్ తన వంతు పాత్ర పోషించారు.