CWC 2023: న్యూజిలాండ్ గెలిచింది.. మరి పాకిస్థాన్ ఏం చేస్తుందో?
వన్డే ప్రపంచకప్ లో సెమీస్ అవకాశాలను న్యూజిలాండ్ సజీవంగా ఉంచుకుంది. మరి పాకిస్థాన్ టీమ్ ఏం చేస్తుందో వేచి చూడాలి.

CWC 2023: New Zealand beat Sri Lanka
ODI World Cup-2023: వన్డే ప్రపంచకప్ లో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ సత్తా చాటింది. గురువారం బెంగళూరు వేదిక జరిగిన కీలక మ్యాచ్ లో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముందుగా పటిష్టమైన బౌలింగ్ తో తక్కువ స్కోరుకే శ్రీలంకను కట్టడి చేసిన కివీస్.. స్వల్ప లక్ష్యాన్ని త్వరగా ఛేదించి సెమీస్ నాలుగో స్థానానికి ముందంజలో నిలిచింది. శ్రీలంక నిర్దేశించిన 172 పరుగుల టార్గెట్ ను 23.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డెవాన్ కాన్వే 45, డారిల్ మిచెల్ 43, రచిన్ రవీంద్ర 42, గ్లెన్ ఫిలిప్స్ 17, విలియమ్సన్ 14 పరుగులు చేశారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన 46.4 ఓవర్లలో 171 పరుగులకు శ్రీలంక కుప్పకూలింది. కివీస్ బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక బ్యాటర్లు బెంబేలెత్తారు. కుశాల్ ఫెరీరా ఒక్కడే కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు. ఆడింది కాసేపే అయినా షాట్లతో అలరించాడు. 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి అవుటయ్యాడు. చివరల్లో మహేశ్ తీక్షణ కివీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. వికెట్ కాపాడుకుంటూ మెల్లగా పరుగులు సాధించాడు. దిల్షన్ మధుశంకతో కలసి చివరి వికెట్ కు 43 పరుగులు జోడించాడు. 91 బంతుల్లో 3 ఫోర్లతో 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మధుశంక 48 బంతుల్లో 19 పరుగులు చేసి చివరి వికెట్ గా అవుటయ్యాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టగా.. లాకీ ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ రెండేసి వికెట్లు తీశారు. టిమ్ సౌతీ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ ఏం చేస్తాయో?
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు ఏం చేస్తాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ రెండు జట్లు తమ చివరి మ్యాచుల్లో ఓడితో ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండానే న్యూజిలాండ్ సెమీఫైనల్లో అడుగుపెడుతుంది. ఒకవేళ గెలిస్తే నెట్ రన్ రేటు కీలకమవుతుంది. ఇప్పటివరకు చూస్తే పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ కంటే కివీస్ కే మెరుగైన రన్ రేటు ఉంది. రేపు జరిగే మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో అఫ్గానిస్థాన్ తలపడనుంది. శనివారం ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ లో మంచి రన్ రేటుతో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్ రేసులో ఉంటుంది. ఆదివారం జరిగే మ్యాచ్ లో భారత్, నెదర్లాండ్స్ పోటీ పడతాయి. భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీఫైనల్లోకి ప్రవేశించాయి.
శ్రీలంక అవుట్
ఈరోజు ఓటమితో వన్డే ప్రపంచకప్ లో శ్రీలంక ప్రస్థానం ముగిసింది. లీగ్ దశ నుంచే శ్రీలంక టీమ్ నిష్క్రమించింది. 9 మ్యాచ్ లు ఆడిన లంక జట్టు కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి 4 పాయింట్లు తెచ్చుకుంది. టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో 55 పరుగులకే ఆలౌటయి అప్రదిష్ట మూటకట్టుకుంది.
Also Read: టీమిండియాను ఓడించగలరా? ఇంగ్లండ్ పై ఓటమి తరువాత నెదర్లాండ్స్ బ్యాటర్ ఆసక్తికర వ్యాఖ్యలు