IND vs PAK : పాక్ పై ఘ‌న విజ‌యం.. బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్ అందుకుంది ఎవ‌రో తెలుసా.. కోహ్లీ, రోహిత్‌లు కానే కాదు..

పాక్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో అదరగొట్టి బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్‌ను అందుకుంది ఎవ‌రంటే..

IND vs PAK : పాక్ పై ఘ‌న విజ‌యం.. బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్ అందుకుంది ఎవ‌రో తెలుసా.. కోహ్లీ, రోహిత్‌లు కానే కాదు..

Do You Know Who Won The Best Fielder Medal After Pakistan Match In Champions Trophy 2025

Updated On : February 24, 2025 / 2:58 PM IST

దాయాదుల స‌మ‌రం ముగిసింది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ పై భార‌త్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజ‌యంతో భార‌త్ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. మ‌రోవైపు పాక్ ఈ టోర్నీ నుంచి నిష్ర్క‌మించిన‌ట్లే. సాంకేతికంగా మాత్ర‌మే ఆ జ‌ట్టుకు చిన్న అవ‌కాశం ఉంది.

దుబాయ్ వేదిక‌గా ఆదివారం భార‌త్, పాక్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. 49.4 ఓవ‌ర్ల‌లో 241 ప‌రుగుల‌కు ఆలౌటైంది. సౌద్ ష‌కీల్‌ 76 బంతుల్లో 62 ప‌రుగులు చేశాడు. కెప్టెన్ రిజ్వాన్ 77 బంతుల్లో 46 ప‌రుగులు సాధించాడు. మిగిలిన వారిలో ఖుష్‌దిల్ షా (38) రాణించ‌గా బాబ‌ర్ ఆజామ్ (23) ఫ‌ర్వాలేద‌నిపించగా, ఇమామ్ ఉల్ హ‌క్ (10), తయ్యబ్ తాహిర్ (4)లు విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ మూడు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అక్ష‌ర్ ప‌టేల్‌, ర‌వీంద్ర జ‌డేజా, హ‌ర్షిత్ రాణాలు త‌లా ఓ వికెట్ సాధించారు.

అనంత‌రం విరాట్ కోహ్లీ (100 నాటౌట్; 111 బంతుల్లో 7 ఫోర్లు) శ‌త‌క్కొట్ట‌డంతో భార‌త్ 242 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 42.3 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు అందుకుంది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (56), శుభ్‌మ‌న్ గిల్ (46) లు రాణించ‌గా రోహిత్ శ‌ర్మ (20) ఫ‌ర్వాలేద‌నిపించాడు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు తీశాడు. అబ్రార్ అహ్మద్, ఖుష్‌దిల్ షా లు చెరో ఓ వికెట్ సాధించారు.

బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్ ఎవ‌రికంటే..?

ఐసీసీ మెగా టోర్నీల్లో ప్ర‌తి మ్యాచ్‌లో అత్యుత్త‌మ ఫీల్డింగ్ క‌న‌బ‌రిచిన ప్లేయ‌ర్‌కు బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్ ఇస్తూ వ‌స్తోంది భార‌త టీమ్ మేనేజ్‌మెంట్. స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచక‌ప్ 2023 నుంచి దీన్ని ప్రారంభించింది. బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ ఈ మెడ‌ల్‌ను అందుకున్నాడు.

ఇక పాక్‌తో మ్యాచ్‌లో అద్భుత ఫీల్డింగ్ చేసిన ప్లేయ‌ర్ కు డ్రెస్సింగ్ రూమ్‌లో మెడ‌ల్ అంద‌జేశారు. టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు శిఖ‌ర్ ధావ‌న్ భార‌త డ్రెస్సింగ్‌లోకి వ‌చ్చి పాక్‌తో మ్యాచ్‌లో ఓపెన‌ర్ ఇమామ్ హ‌క్‌ను సూప‌ర్ త్రో ర‌నౌట్ చేసిన అక్ష‌ర్ ప‌టేల్‌ బెస్ట్ ఫీల్డ‌ర్ అవార్డుకు ఎన్నికైన‌ట్లు చెప్పాడు. ఆ త‌రువాత అక్ష‌ర్ మెడ‌లో బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్‌ను వేశాడు ధావ‌న్‌. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.