Ind vs Eng Test: గిల్ కెప్టెన్ గా బరిలోకి దిగే జట్టు ఇదే..! పిచ్ రిపోర్ట్..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం ప్రారంభం కానుంది.

India vs England First Test: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానుంది. లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) మధ్యాహ్నం 3.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బరిలోకిదిగే భారత్ తుది జట్టు ఏ విధంగా ఉంటుందనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. తుది జట్టులో చోటు దక్కించుకునే ప్లేయర్లు ఎవరు.. పిచ్ ఎలా ఉండబోతుందనే అంశాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభం సందర్భంగా.. భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ భారత్ జట్టు ప్లేయింగ్ 11 గురించి ప్రస్తావించారు. తుది జట్టులో ఉండబోయే ప్లేయర్లు వీరే అంటూ ఆయన ట్విటర్ ఖాతా వేదికగా వెల్లడించారు.
సంజయ్ మంజ్రేకర్ అంచనా ప్రకారం.. భారత్ జట్టు మొదటి టెస్టుకోసం అనుభవజ్ఞులైన ప్లేయర్లు, యువ ప్లేయర్లతో కూడిన ప్లేయింగ్ లెవెన్‌ను ఆయన ఎంపిక చేశారు. వీరిలో.. కేఎల్. రాహుల్, యశస్వీ జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, నితీశ్ రెడ్డి/ కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ర్పీత్ బుమ్రా ఉన్నారు.
My playing XI first Test –
Rahul
Jaiswal
Sudarshan
Gill
Pant
Nair
Jadeja
Reddy/Kuldeep
Siraj
Prasidh
Bumrah— Sanjay Manjrekar (@sanjaymanjrekar) June 20, 2025
సంజయ్ మంజ్రేకర్ తాను ప్రకటించిన జట్టులో ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు కల్పించలేదు. అయితే, బుమ్రా ఆడకుంటే అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం దక్కుతుందని ఆయన అంచనా వేశారు. కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. మూడు, నాలుగు స్థానాల్లో క్రీజులోకి వచ్చే సుదర్శన్, శుభ్‌మన్ గిల్ పరుగులు రాబట్టడంలోనూ, ఇంగ్లాండ్ బౌలర్లను ఇబ్బంది పెట్టడంలోనూ కీలక బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నారు.
పిచ్ ఎలా ఉందంటే..
పిచ్ పై కాస్త పచ్చిక ఉంది. ఆరంభంలో కాస్త పేసర్లకు సహకరించినా.. వేడి, పొడి వాతావరణంలో మ్యాచ్ సాగుతున్నాకొద్దీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా మారుతుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. హెడింగ్లీలో ఏడు టెస్టులాడిన టీమిండియా రెండు గెలిచి.. నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది.