ENG vs IND : వర్షం శుభ్‌మన్ గిల్ సేనను కాపాడుతుందా? మాంచెస్టర్‌లో నాలుగో రోజు వాతావరణ నివేదిక ఇదే..
మాంచెస్టర్ టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా అంచనాలను అందుకోలేకపోయింది.

ENG vs IND 4th test today Manchester weather report
మాంచెస్టర్ టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా అంచనాలను అందుకోలేకపోయింది. భారత జట్టు ఇక పోరాడాల్సింది గెలుపు కోసం కాదు.. డ్రా కోసమే. ఇప్పటికే 186 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకుంది. రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు ఉన్నది ఇంగ్లాండ్‌కే. ఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు అసాధారణంగా పోరాడితేనో, వరుణుడు కరుణిస్తేనో మ్యాచ్ డ్రా అవుతుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. క్రీజులో బెన్‌స్టోక్స్ (77), లియామ్ డాసన్ (21)లు ఉన్నారు.
ENG vs IND : శుభ్‌మన్ గిల్‌ను చిక్కుల్లో పడేసిన బౌలింగ్ కోచ్.. అరెరె ఇప్పుడెలా సామీ..
నాలుగో రోజు సాధ్యమైనంత త్వరగా ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేస్తేనే.. కనీసం డ్రా చేసుకునేందుకు భారత్‌కు అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో వర్షం వల్ల ఆట రద్దు అయ్యే అవకాశాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. మాంచెస్టర్‌లో నాలుగో రోజు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్షం పడే అవకాశాలు 20 శాతం ఉన్నట్లు వెదర్ డాట్‌కామ్ తెలిపింది.
77 శాతం ఆకాశం మేఘావృతమైన పరిస్థితులు ఉంటాయని అంచనా. మధ్యాహ్నం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం 9 శాతం ఉన్నట్లు పేర్కొంది. అంటే వర్షం పడి మ్యాచ్ సమయాన్ని కోల్పోయే అవకాశాలు చాలా తక్కువ.
అయితే.. వర్షం పడకున్నా ఆకాశం మేఘావృతమై ఉంటే మిగిలిన ఇంగ్లాండ్ బ్యాటర్లను ఔట్ చేయడం కాస్త తేలిక అవుతుంది. ఎందుకంటే ఇంగ్లాండ్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటే.. పిచ్ పేసర్లకు ఎక్కువగా సహకరిస్తూ ఉంటుంది. అదే సమయంలో భారత బ్యాటర్లకు కష్టాలు తప్పకపోవచ్చు.