ENG vs IND : వారెవ్వా జోరూట్.. రాహుల్ ద్రవిడ్ ప్రపంచ రికార్డు సమం..
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోరూట్ అరుదైన ఘనత సాధించాడు.

ENG vs IND Joe Root Achieves Big Record Equals Rahul Dravid Test Feat
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోరూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా ఉన్న భారత దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ రికార్డును సమం చేశాడు. హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ నాలుగో రోజు భారత రెండో ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్ క్యాచ్‌ను అందుకోవడంతో రూట్ ఈ ఘనత సాధించాడు.
రాహుల్ ద్రవిడ్, జో రూట్ ఇద్దరూ ఇప్పటి వరకు టెస్టు క్రికెట్‌లో అవుట్ ఫీల్డ్‌లో చెరో 210 క్యాచ్‌లు అందుకున్నారు. ద్రవిడ్ 164 టెస్టుల్లో ఈ ఘనత సాధించగా జో రూట్ 154 మ్యాచ్‌ల్లో అందుకున్నాడు. భారత్‌తో సిరీస్‌లో మరో క్యాచ్‌ను అందుకుంటే ద్రవిడ్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడు. వీరిద్దరి తరువాత స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే ఉన్నాడు. అతడు 205 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మార్క్ బౌచర్ అగ్రస్థానంలో ఉన్నాడు. బౌచర్ 532 క్యాచ్‌లను అందుకున్నాడు.
ENG vs IND : భారత్ 370 పరుగులను కాపాడుకోగలదా? హెడింగ్లీలో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతంటే..?
టెస్టు క్రికెట్‌లో ఔట్ ఫీల్డ్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్లు వీరే..
రాహుల్ ద్రవిడ్ (భారత్) – 210 క్యాచ్‌లు
జోరూట్ (ఇంగ్లాండ్) – 210 క్యాచ్‌లు
మహేలా జయవర్దనే (శ్రీలంక) – 205 క్యాచ్‌లు
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 200 క్యాచ్‌లు
జాక్వస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 200 క్యాచ్‌లు
కుక్ రికార్డు సమం..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రికార్డును జోరూట్ సమం చేశాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ భారత్ పై 30 టెస్టులు ఆడి 38 క్యాచ్‌లు అందుకోగా రూట్ 31 మ్యాచ్‌ల్లోనే 38 క్యాచ్ లు పట్టుకున్నాడు. వీరిద్దరి తరువాతి స్థానాల్లో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్‌లు ఉన్నారు. గవాస్కర్ 35 క్యాచ్‌లు అందుకోగా ద్రవిడ్ 30 క్యాచ్‌లు పట్టుకున్నాడు.
ENG vs IND : ఐదో రోజు ఆటకు వర్షం ముప్పు.. పాపం ఇంగ్లాండ్.. గెలుద్దామనుకుంటే..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్లు వీరే..
అలిస్టర్ కుక్ – 38 క్యాచ్‌లు
జోరూట్ – 38 క్యాచ్‌లు
సునీల్ గవాస్కర్ – 35 క్యాచ్‌లు
రాహుల్ ద్రవిడ్ – 30 క్యాచ్‌లు
విరాట్ కోహ్లీ – 25 క్యాచ్‌లు
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రెండో ఆటగాడిగా జోరూట్ నిలిచాడు. 65 టెస్టుల్లో 102 క్యాచ్‌లను రూట్ అందుకున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. స్మిత్ 102 ఇన్నింగ్స్‌ల్లో 104 క్యాచ్‌లు పట్టుకున్నాడు.