Shubman Gill: చరిత్ర సృష్టించిన శుభ్ మన్ గిల్.. పాక్ మాజీ క్రికెటర్ రికార్డ్ బద్దలు..

రెండో టెస్ట్ ఎడ్జ్‌బాస్టన్‌ మ్యాచ్ లో డబుల్‌ సెంచరీ (269), సెంచరీతో (161) చెలరేగాడు.

Shubman Gill: చరిత్ర సృష్టించిన శుభ్ మన్ గిల్.. పాక్ మాజీ క్రికెటర్ రికార్డ్ బద్దలు..

Updated On : July 26, 2025 / 9:48 PM IST

Shubman Gill: భారత జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ దూసుకుపోతున్నాడు. టెస్ట్ క్రికెట్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన గిల్.. తాజాగా ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్ మ్యాచ్ లో మరో ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌ గడ్డపై టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు గిల్. పాక్ మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ యూసుఫ్‌ పేరు మీదున్న రికార్డును బద్దలు కొట్టి ఈ ఫీట్‌ సాధించాడు గిల్.

లీడ్స్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో 147 పరుగులు, 8 పరుగులు చేశాడు. రెండో టెస్ట్ ఎడ్జ్‌బాస్టన్‌ మ్యాచ్ లో డబుల్‌ సెంచరీ (269), సెంచరీతో (161) చెలరేగాడు. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ లో 16 పరుగులు, 6 పరుగులే చేశాడు. తాజాగా మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగులే చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం గిల్‌ రాణించాడు. కష్ట సమయంలో హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్‌గా అవతరించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యూసుఫ్‌ను అధిగమించాడు గిల్.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా గిల్‌ మే 25న పగ్గాలు చేపట్టాడు. అతడి సారథ్యంలో టీమిండియా తొలుత ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. 2006 లో పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఆ సమయంలో పాక్ క్రికెటర్ మహమ్మద్ యూసుఫ్ నాలుగు మ్యాచులు ఆడి ఏడు ఇన్నింగ్స్ లో 631 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో యూసుఫ్ రికార్డ్ ను గిల్ బ్రేక్ చేశాడు. ఇక 2016లో ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ 5 మ్యాచుల్లో 655 పరుగులు సాధించాడు. కెప్టెన్ గా తొలి రెండు టెస్టుల్లో గిల్ మూడు సెంచరీలు నమోదు చేశాడు.

Also Read: క్రికెట్ ఫ్యాన్స్‌కి పండగే.. ఇండియా, పాకిస్థాన్ ఫైట్.. ఏకంగా మూడు సార్లు.. రచ్చ రచ్చే.. !

ఇంగ్లాండ్‌ పై టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ టాప్ లో ఉన్నాడు. 2024లో ఇంగ్లాండ్ టూర్ లో 5 మ్యాచుల్లో 712 పరుగులు చేశాడు జైస్వాల్. టెస్ట్ సిరీస్ లో SENA (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా క్రికెటర్ గా విరాట్ కోహ్లి రికార్డ్ క్రియేట్ చేశాడు. 2014-15 లో ఆసీస్ టూర్ లో 4 మ్యాచులు ఆడిన కోహ్లి 629 పరుగులు చేశాడు.

ఇంగ్లాండ్ గడ్డపై ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్లు..
* శుబ్‌మన్‌ గిల్‌ (భారత్) 645 పరుగులు*- 2025లో- బెస్ట్ స్కోర్ 269
* మహమ్మద్‌ యూసుఫ్‌ (పాకిస్తాన్‌)- 631 పరుగులు- 2006లో- బెస్ట్ స్కోర్ 202
* రాహుల్‌ ద్రావిడ్‌ (భారత్)- 602 పరుగులు – 2002లో- బెస్ట్ స్కోర్ 217
* విరాట్‌ కోహ్లీ (భారత్)- 593 పరుగులు – 2018లో- బెస్ట్ స్కోర్ 149
* సునీల్‌ గావస్కర్‌ (భారత్)- 542 పరుగులు – 1979లో- బెస్ట్ స్కోర్ 221.